Friday, June 12, 2009

నొప్పులు పడుతున్నా... నీ బిడ్డనై పుట్టేందుకు

నీతో ఏ బంధమూ లేనప్పుడే బాగుంది. రెక్కలుండేవి నాకు. నేను ఎగిరే ఆకాశంలో ఆ రెక్కలపై.. వద్దన్నా వచ్చి మేఘమాలికలు ఆగేవి. గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ ఎక్కడెక్కడో కురిసి, ఇంద్రధనస్సుగా ఒక్కటై విరిసేవాళ్ళం.. నేనూ, నా మాలికలు. అక్కడికో జన్మ.

మళ్ళీ ఇంకోలా పుట్టేవాడిని. అప్పుడు చక్కటి గొంతు ఉండేది. దీర్ఘం తీసుకుంటూ వెళుతుంటే.. కనిపించని కోకిల ఆపి ఆపి ఆగి ఆగి పిలిచేది కొమ్మల్లోంచి.. ‘‘అబ్బాయ్‌ వస్తావా కలిసి పాడుకుందాం’’ అని.
‘‘ముఖం చూడు’’ అనేవాడిని. అంత తిక్క నాకు.
‘‘చూశా.. చందమామలా ఉంది. అందుకేగా రమ్మంది’’ అనేది. అదొక చెలిమి. కుహూకుహూమని పొడుచుకు చచ్చేవాళ్ళం నేనా దారిన వెళ్ళినప్పుడల్లా.

ఇంకా ఎవరెవరో నొప్పులు పడేవారు నా కోసం. ఒక తల్లి కాదు.
ఎవరెవరో గోరింటాకు పెట్టేవారు. ఒక చెల్లి కాదు.
అప్పుడు నువ్వెక్కడా కనిపించలా. ఎవరి నవ్వులోనూ వినిపించలా. అసలు నువ్వు ఉన్నట్లే అనిపించలా. నా ప్రపంచం హాయిగా ఉండేది. ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయ్యాక.. నొప్పులు పడుతున్నా.. నీ బిడ్డనై పుట్టేందుకు.
కనిపారెయ్‌ చాలు. అదే కనికరం.
***
నిన్ను ఎక్కడో దాచేసి, వేకువ ఒక్కటే వచ్చి కువకువ మంటుంది నా గదిలోకి. అదెందుకు నాకు? నువ్వు లేకుండా, నువ్వు రాకుండా. ఆ దాపరికపు నీడల్ని.. కిరణాల పూలగుత్తిలా చుట్టి చేతికిచ్చి నేనింకా కళ్ళు తెరవక ముందే ‘‘శుభోదయం’’ అంటూ వెళ్ళిపోతుంది. అన్ని నీ ఐడియాలే. క్షణంలో వచ్చేస్తానని యుగాలు దాటి వెళతావు కదా. గుర్తుకొచ్చి గుక్క పట్టకుండా నీ సెల్‌ఫోన్‌ నుంచి ‘‘హౌ ఆర్‌ యూ?’’ అని కూడా అంటావ్‌ కుమ్మరింపుల ప్రేమతో. ఏం చెప్పేది? తెలిసీ అడుగుతుంటే! పాల కోసం ఏడ్చి ఏడ్చి, కంఠం కొట్టుకుపోయి, డొక్కలు ఎగిరిపడి, ఆకలి అలలై విరిగి పడినప్పుడు పట్టిన నిద్రలో పక్కన చేరి.. ఎండిన పెదవుల్లోంచి చుక్కల చుక్కలుగా ప్రాణాలు పోసినట్లు ఉంటుంది నీ పరామర్శ! గొప్ప డిస్‌ప్లేస్‌మెంట్‌ ఆర్టిస్టువి. నేనెక్కడ తట్టుకోను? స్థిరచిత్తం లేని నీ విశ్వాంతరాళ గమనాన్ని, ఆ వేగాన్ని?

నడక చేర్చుకుంటా. నీ వెంట అడుగులు వెయ్యనివ్వు.
తూలి నీ ఒడిలో పడనివ్వు.
***
సమయం: 2007 ఆగస్టు 19 (‘వార్త’ సండే)

సందర్భం: ఒడుపుగా, వేగంగా స్థానభ్రంశం చెందడం ‘డిస్‌ప్లేస్‌మెంట్‌ ఆర్ట్‌’. ఫ్రెంచ్‌మన్‌ డేవిడ్‌ బెల్‌ ఈ కళకు ఆద్యులు. ఏడిపించుకు తినే ప్రేమ భావాల అస్థిరత్వానికి ఒక చక్కటి ప్రతీక డిస్‌ప్లేస్‌మెంట్‌ ఆర్ట్‌. దీనికి డేవిడ్‌ పెట్టిన పేరు ‘పార్కర్‌’. స్ర్తీలకు పార్కర్‌ స్కిల్స్‌ ఎక్కువని ఆయన అంటారు. బెర్లిన్‌లో తరచు పార్కర్‌ ప్రదర్శనలు జరుగుతుంటాయి.

జ్ఞాపకం: ఆఫీస్‌కి ఎవరో ఫోన్‌ చేశారు - ‘‘నిజంగానే మీకు తిక్కా?’’ అని.
‘‘ఎందుకలా అడిగారు’’ అని అడిగాను.
‘‘డిస్‌ప్లేస్‌మెంట్‌ కనిపిస్తుంటేనూ...’’ అని పెట్టేశారు, ‘‘ఎందులో?’’ అని అడిగే అవకాశం ఇవ్వకుండా.