Saturday, June 13, 2009

మా సారు

నా ఫేస్‌ ఎందుకో మా సార్‌కి నచ్చదు! బటై లవ్హిమ్‌. నా కోసం ఆయన గట్టిగా బజర్‌ నొక్కి పిలిపించకపోతే ఆ వేళ నాకు ఆఫీస్‌లో నిద్ర పట్టినట్లే ఉండదు. ఆయన కోసం ఆయన సెలవు పెడితే.. నా సీట్లో నేను కూర్చున్నట్లే ఉండదు. ఆ రోజంతా ఇంకో డెమొక్రాట్‌ దొరకడు నాకు.. ముఖం ఎదురుగా కాళ్ళెత్తి టేబుల్‌ మీద పెట్టి - కుర్చీలో వెనక్కి జారిగిల పడేందుకు. అది కాదు నా సమస్య. మా సెక్షన్‌లో మిస్‌ మాంగల్యవతి కూడా అదే సమయానికి ఇక్కడ తన సీట్లో కనిపించరు! ఇద్దరూ కలిసి ఎక్కడున్నట్లు? ఏం చేస్తున్నట్లు?

మా సార్‌ నవ్వరెందుకని మీ డౌటు. అవునా? అదాయన యు.ఎస్‌.పి. యునీక్‌ సెల్లింగ్‌ ప్రపొజిషన్‌. నవ్వితే.. మీరేం చేస్తారో తెలుసు. నవ్వితే.. నేనేం చేస్తానో తెలుసు. నవ్వితే.. మీరూ నేనూ కలిసి ఏం చేస్తామో కూడా ఆయనకు తెలుసు. స్వింగ్‌ డోర్స్‌ తోసుకుని వెళ్ళి ‘‘నమస్తే సార్‌’’ అంటారు మీరు.. బుగ్గన రాజా ఖైనీ ఊరబెట్టుకుంటూ. అంత బిజీలోనూ తలెత్తి ఆయన మీ వైపు చూస్తారు. మీరాయన వైపు చూడనైనా చూడకుండా బర్రున కుర్చీ లాక్కుని కూర్చుంటారు.‘‘చెప్పండి’’ అన్నట్లు చూస్తుంది ఆయన ప్రసన్న వదనం. మీరూ చూస్తుంటారు కానీ, ఆయన్ని కాదు! పాన్‌ మసాలా ఉమ్మేయడానికి అక్కడ మీకో ప్లేస్‌ కావాలి. ఆయన తెల్లచొక్కా ఒక్కటే ఖాళీగా కనిపిస్తుంది. ‘‘మరక మంచిదే. సర్ఫెక్సెల్‌ ఉందిగా’’ అనిపిస్తుంది మీకు. ఈసారి - వదనంతో కాకుండా నేరుగా నోటితోనే అంటారాయన ‘‘చెప్పండి’’ అని. ఆ మాట అనవలసింది నేను కదా అన్నట్లు చూస్తుండిపోతారు మీరు! క్రితం సాయంత్రం ఆఫీస్‌ ఫంక్షన్‌లో పై అధికారి ఎవరితోనో మా సార్‌ నవ్వుతూ మాట్లాడి, అనుకోకుండా ఆ నవ్వుని మీ వైపు పొడిగించిన పర్యవసానమది. ఇక నా హెడ్వెయిట్‌ సంగతి చెబితే మా సారే చెప్పాలి. నా తర్వాత ఆయనంతటివాడు లేడని నాకో నమ్మకం. ఆయనకు సిగరెట్‌ అలవాటు లేదు కానీ, ఉంటే భుజమ్మీద చెయ్యేసి కేఫ్‌కి లాక్కెళ్ళి ముఖమ్మీద ఉఫ్‌మని ఊదేద్దును. ఇంటిమసీ కోసం. అందుకేనేమో మా సారెప్పుడూ నవ్వరు - మీరెదురైనా, నేనెదురు చూసినా నవ్వరు. ఇంతటి నేను, అంతటి మీరు క్యాంటీన్‌లోనో, కాంపౌండ్‌లోనో కలిస్తే ఇంకేమైనా ఉందా?సార్‌ హాండ్సమ్‌గా ఉండేవారట! యాపిల్‌లా.మాకు బాస్‌గా వచ్చాక - ఇదిగో ఇప్పుడిలా!

సమయం: 2007 జూన్‌ 3 (‘వార్త’ సండే)

సందర్భం: ఒక క్రియేటివ్‌ హెడ్‌కు ఉన్నన్ని తెలివితేటలు ‘బొకిటో’ గొరిల్లాకు ఉంటాయట! నెదర్లాండ్స్‌ జూలోకి కొత్తగా వచ్చిన బొకిటో ఫొటోను చూసినప్పుడు ఒకప్పటి నా ఇన్-చార్జ్ లంతా లీలగా కదలాడారు. వ్యక్తిగతంగా వారు ఎంత ప్రసన్నంగా, హ్యాండ్సమ్‌గా, రొమాంటిక్‌గా, కామెడీగా ఉన్నా.. సన్నగా ఏ మూలో వారందరిలో బొకిటోనియన్‌ ఛాయలు కనిపిస్తుంటాయి! ఈ ‘అమానుషమైన ఎవల్యూషన్‌’కు కారణం కేబిన్లా? కింది ఉద్యోగులా? అని తర్కించుకుంటూ రాసిన ముక్కలివి.

జ్ఞాపకాలు: ‘‘మీ ఇన్‌చార్జ్‌ ఏమీ అన్లేదా? ఆయన మీద రాసినందుకు’’ - అని కొందరు నన్ను కోపంగా అడిగారు. అదే మాటను గొప్ప సంతృప్తి నిండిన కళ్ళతో... ఆయనంటే గిట్టని వాళ్ళు అడిగారు. ‘‘వీలైతే మళ్ళీ ఒకసారి చదవండి. అది మా సార్‌ మీద రాసింది కాదు, నా మీద నేను రాసుకున్నది’’ అని చెప్పాను. ఒక బండ పిల్ల అయితే ఈ ఐటమ్‌ రాసిన చాలాకాలం తర్వాత (కనీసం ఆరు నెలల తర్వాత)... విషయాన్ని మళ్ళీ తోడి, ‘‘ఏంటలా రాశారు? నేనే గనుక మీ ఇన్‌ఛార్జిని అయివుంటే, ఇలా రాస్తే ఒప్పుకునేదాన్ని కాదు. ఆయన కాబట్టి ఊరుకున్నాడు’’ అంది.
అవును, ఆయన కాబట్టి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగారు.