Monday, June 15, 2009

కనిపించుట లేదు!

పిల్లలు.. పసికందులైతే అమ్మ ఒడిలో ఉండాలి. లేదా బడిలో ఉండాలి. అక్కడా లేకపోతే ఆటల్లో, పాటల్లో.. ఆపుకోలేని వారి నవ్వయినా వినిపిస్తుండాలి. చీకటి పడితే చందమామను పిలుస్తుండాలి. చీకట్లో భయపడితే నాన్న పక్కకు వచ్చేయాలి. బారెడు పొద్దెక్కాక నాలుగు తగిలాకే లేవాలి. గడగడ తాగేయమని గ్లాసుడు పాలిస్తే ‘థూ.. యాక్‌’ మని వాటిని తన్నేయాలి. రెండు చుక్కల కాఫీ కోసం ‘దయలేని’ ఈ పెద్దలను దేబిరించాలి. టూన్‌ డిస్నీలో జెటెక్స్‌ పవర్‌ రేంజర్స్‌లా ‘యస్పీడీ ఎమర్జెన్సీ’ అంటూ గాల్లోకి లేస్తుండాలి. అల్లరికి తగిన కానుక అందుకుని, అంతలోనే మామయ్య కొని తెచ్చిన కొత్త బొమ్మను ముఖమింత చేసుకుని చూస్తూ పాలబుగ్గలపై కనీళ్ళ చారికలను తుడిచేసుకోవాలి. ఇవేవీ లేకుంటే.. మిస్సింగ్‌! బాల్యం ఎక్కడో కుటుంబ భారం మోస్తున్నట్లే. బేకరీ నిప్పుల బట్టీ దగ్గర పిండి పిసకలేక ఉగ్గుపాలు కక్కుతున్నట్లే. కిటికీల్లేని గిడ్డంగులలో రసాయనాల కింద మగ్గుతున్నట్లే. రూపాయి కోసం రెక్కల్ని తాకట్టు పెట్టి జీవితాన్ని వడ్డీగా కడుతున్నట్లే. మిస్సింగ్‌. కనిపించుట లేదు. బాల్యమా? మానవత్వమా?
***
నీరజ్‌కు తొమ్మిదేళ్ళు. సిలిగురి రైల్వేస్టేషన్‌లో సెవన్‌టు ఎయిట్‌ పేపర్‌బాయ్‌. ఆ తర్వాత వాడి శ్రమను వాడే విభజించుకుని డాబా కిచెన్‌లో పరోటాలు కొడతాడు. ఆటోబజార్‌లో కార్లు కడుగుతాడు. చాలని పొద్దును.. నిద్ర నుంచి అరువు తెచ్చుకుని ఇంకా ఏవో లక్ష పనులతో భాగాహారం చేస్తాడు. వాడి గడియారంలో చిన్న ముల్లు సన్నముల్లులా తిరుగుతుంది. తెల్లారడానికి ఎంతసేపు? బతుకైనా, బాల్యమైనా.
పధ్నాలుగేళ్ళలోపు బాలల చేత పని చేయించడాన్ని 1948లో భారత ప్రభుత్వం నిషేధించింది. 17 రకాల పరిశ్రమల్లో బాలకార్మిక వ్యవస్థను 1986లో రద్దు చేసింది. అయితే యునిసెఫ్‌ లెక్కల ప్రకారం నేటికింకా 9 కోట్ల మంది బాలలు అత్యంత ప్రమాదకరమైన పరిసరాలలో వెట్టి చాకిరీ చేస్తున్నారు.

సమయం: 2006 జూన్‌ 25 (‘వార్త’ సండే)

సందర్భం: ‘వరల్డ్‌ డే ఎగైన్‌స్ట్‌ చైల్డ్‌ లేబర్‌ ’ (జూన్‌ 12) సందర్భంగా ఎ.పి., ఎఎఫ్‌.పి., ఏజెన్సీలు విడుదల చేసిన ఫొటోలు చూశాక.

జ్ఞాపకం: బేకరీకి వెళ్ళి ఏదైనా తింటున్న ప్రతిసారీ.. లోపల పిల్లలు గానీ పనిచేయడం లేదు కదా అనిపిస్తుంది.