Wednesday, June 17, 2009

బ్యాడ్‌ బాయ్స్‌ డాట్‌ కామ్‌

బిలో ది బెల్ట్‌ - కొట్టడం ఆర్ట్‌లో సమకాలీనత! పిలగాళ్ళు ఊరుకోవట్లా. గాఢంగా వ్యక్తం చేస్తున్నారు. జడ కుదుళ్ళను గుప్పెట బిగించి పట్టుకుని, ముఖాన్ని వెనక్కి విరిచి పెదవులు కొరికినంత గాఢంగా. నిర్దయ కూడా! ఎంతంటే, చెంపల్ని నిమిరే నెమలీకల్ని టెక్స్ట్ బుక్కులోంచి తీసి అవతల పారేసి, చేత్తో ఛెళ్ళున ప్రేమిస్తున్నారు. స్ట్రోక్స్‌ని తట్టుకున్నదే వారి దృష్టిలో కేన్వాస్‌. చుర్రున పుట్టే మంట.. ఆ ప్రేమకు ఎక్స్‌ప్రెషన్‌. పైపై పూతల పాన్‌ మసాలా అఫ్రోడీజియాక్‌తో.. ఆర్ట్‌ స్తంభన జరగదని వీరికి అర్థమైపోయినట్లుంది. నాడి బలహీనంగా కొట్టుకుంటున్నవారు మెట్ల దగ్గరే ఆగిపోతే బెటర్‌. పైన హుస్సేన్‌ సాబ్‌ పడక గ్యాలరీలో బట్టలు సర్దుకుంటున్న మాధురీ, టబూ, అమృతారావ్‌ల కుచ్చిళ్ళ నుంచి రాలి పడిన బ్రష్‌లు ఇవన్నీ. లిబిడినస్‌ డివినిటీ అంటుకుని ఉంటుంది. వెన్నుపూసల్ని గలగలలాడించి, నల్లపూసల్ని గడప దాటించే డివినిటీ!
***
సంప్రదాయ మొహమాటాల్లేనిది కాంటెపరరీ ఆర్ట్‌. హృదయాన్ని తాకడానికి - అవసరమైతే హెవీ ట్రాఫిక్‌లో రోడ్డుకి అడ్డంగా నులక మంచం వాల్చుకుని కాలు మీద కాలితో పవళిస్తుంది. మనసాగకపోతే - వాకిట్లో ముగ్గేసి, బుగ్గపొడి తుడుచుకుంటున్న మిసెస్‌ మాలినీ అయ్యర్‌కి నిర్బిడియంగా కన్ను గీటుతుంది. చెంగ్‌ యాంగ్‌ అనే చైనా చిత్రకారుడి నిగూఢ భావోద్వేగాలు కూడా ఇలాంటివే. ఐరోపా ఖండంలోనే అతి పెద్దదైన ‘పాంపిడో’ కాంటెంపరరీ ఆర్ట్‌ మ్యూజియం (ఫ్రాన్స్‌)లో శిల్పంలా కూర్చుని ఉన్న ఈ యువతిని చదవగలిగితే ఆయన వ్యక్తమౌతారు. ఒళ్ళంతా బ్రెయిలీ లిపిలో ఏదో రాసి ఆమెను ప్రదర్శనకు పెట్టారు చెంగ్‌. స్ర్తీని అర్థం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుని ఆమె దేహాన్ని స్పృశించాలట.. అంతస్సౌందర్యంలోకి వెళ్ళి చూడాలన్నది భావం.

సమయం: 2006 డిసెంబర్‌ 24 (‘వార్త’ సండే)

సందర్భం: చైనాలో కూడా ఒక పాంపిడో మ్యూజియం స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నపుడు.

జ్ఞాపకం: ‘వార్త’ ఆఫీసులో పేజ్‌ లే-అవుట్‌ క్యాబిన్‌ ఓ మూలకు ఉంటుంది. మాణింగ్‌ అవర్స్‌లో అది ఖాళీగా, ప్రశాంతంగా ఉంటుంది. ‘వార్త’ లో ఉండగా నేను రాసిన చాలా ఐటమ్స్‌ ఆ క్యాబిన్‌లో రాసినవే. అలా ఒకసారి ఐటమ్‌ రాస్తూ, ధ్యానముద్రలో ఉండగా... ఒక అబ్బాయి చప్పుడు కాకుండా వచ్చి పక్కన నిలుచున్నాడు. చాలా చిన్న కుర్రాడు. అతన్ని స్పోర్ట్స్ డెస్క్‌లో చూసినట్లు గుర్తు. ‘‘సార్‌... మీరు ఏమీ అనుకోపోతే’’... అన్నాడు. ‘‘నిన్న సండే బుక్‌లో మీరు రాసిందేమిటో అర్థం కాలేదు, నిజంగా సార్‌’’ అన్నాడు. ఆఖర్న - ‘‘మీక్కాస్త టైమ్‌ దొరికితే అర్థం చెప్తారా?’’ అని అడిగాడు. అడిగి, వెళ్లిపోయాడు.
నేను - నా ఐటమ్‌ మధ్య - విరామంగా... దీర్ఘాలోచన.
‘బ్యాడ్‌ బాయ్స్‌ డాట్‌ కామ్‌’ వంటి ఐటమ్స్‌ అర్థం కావడానికి బ్యాడ్‌ బాయ్‌ అయివుండాలా?
లంచ్‌ అవర్‌లో ఇదే ప్రశ్నను ఆ రోజుకి నాకు కంపెనీ ఇచ్చిన స్ర్తీమూర్తిని అడిగాను.
‘‘అర్థం కావడానికేమో కానీ, అలాంటివి రాయడానికి మాత్రం బ్యాడ్‌బాయ్‌ అయివుండాలి’’ అన్నారావిడ.