Friday, June 19, 2009

కొత్తగా పుట్టు... పాటగానో, హృదయాన్ని మీటే మాటగానో...

మళ్ళీ ఏమయింది? ఏమిటా ముఖం? జీవితం బాగోలేదా? ఎప్పట్నుంచి? ఓ ఐదు నిమిషాల నుంచా? అరగంట నుంచా? ఇప్పుడే కదా ప్రపంచాన్ని జయించి వస్తానని వెళ్ళావ్‌.. నీ ఆర్ట్‌తో! మధ్యలో వదిలేసి వచ్చినట్లున్నావ్‌! నమ్మకం పోయింది కదూ నీ మీద నీకు. భయం! నెగ్గకపోతే వాడో వీడో నవ్వుతాడు. నువ్వది పట్టుకుని వేలాడుతావ్‌! రక్తంలో ఇంత భయం ప్రవహిస్తుంటే నీ వెన్నుపామే నిన్ను కాటేస్తుంది, లోకం దాకా ఎందుకు?
శిల్పాన్ని చెక్కుదామని కూర్చున్నావ్‌. నచ్చుతుందా లేదా అన్న ఆలోచన వదిలెయ్‌. పని కానియ్‌. తపస్సులా. పని నిన్ను మింగేయాలి. నమిలి నెమరేయాలి. మెప్పించడం నీ పని కాదు. తపించి, తనువు చాలించి కొత్తగా పుట్టు. పాటగానో, హృదయాన్ని మీటే మాటగానో పుట్టు. కొత్తగా ఎదుగు. భయం భయంగా చేసే పని నిన్ను పూర్తిగా బతకనివ్వదు, పూర్తిగానూ చంపదు. బతికినంత కాలం ఇదే చావు. చావనంత కాలం ఇదే బతుకు.
***
ఎడ్వర్డ్‌ బ్రాఫ్‌ని చూడు. గొప్ప ఆర్టిస్టు. వాస్తు శిల్పి. నింగికీ నేలకూ కాకుండా ఎలాగయ్యాడో చూడు. పాపం ఎంతో ఆశతో ఉరేసుకున్నాడు. ఇప్పుడు ఉసూరుమంటున్నాడు. చావలేడు. బతకలేడు. మృత్యుదేవతకు కోపం తెప్పించాడు మరి. ఆవిడ అనుమతి తీసుకోకుండానే చావాలని ప్రయత్నించాడట! ఎలా చస్తావో నేనూ చూస్తానని ఎదురుగా కూర్చుంది. గంటలు గంటలు మరణిస్తున్నాయి. బ్రాఫ్‌ ఏ క్షాణానికాక్షణం బతుకుతున్నాడు. ఎందుకీ పని చేశాడు? భయం! తన టాలెంట్‌ని జనం వేలెత్తి చూపుతారేమోనన్న భయం. అతడో చర్చి కడుతున్నాడు. సగం పూర్తయింది. అంత అద్భుతంగా రాలేదనుకున్నాడు. ముందుకు వెళ్ళలేకపోయాడు. అప్రతిష్టను తప్పించుకోవాలనుకుని ఉరేసుకున్నాడు. ‘ది హ్యాంగింగ్‌ మ్యాన్‌’ అనే నాటకంలోని సన్నివేశమిది. బ్రిటిష్‌ థియేటర్‌ కంపెనీ ‘ఇంప్రాపబుల్‌’ ఈ నాటకాన్ని ‘సిడ్నీ అపేరా హౌస్‌’లో తరచు ప్రదర్శిస్తుంటుంది. ప్రదర్శన కొనసాగినంత సేపూ... స్టేజి మీద బ్రాఫ్‌ ఇలా గాలిలో తేలుతూనే ఉంటాడు. మరణం లేని జీవితం ఎంత అర్థరహితం! భీతిల్లిన సృజనశీలి జీవితంలా!

సమయం: 2006 మే 14 (‘వార్త’ సండే)

సందర్భం: సిడ్నీ అపేరా హౌస్‌లో ‘ది హ్యాంగింగ్‌ మ్యాన్‌’ ప్రదర్శనలోని కొన్ని భాగాలను ఏదో ఫారిన్‌ చానల్‌లో చూశాక. (బ్రాఫ్‌గా రిచర్డ్‌ కర్జ్‌, 3 అడుగుల 6 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న మృత్యు దేవతగా లిసా హ్యామండ్‌ నటించారు).

జ్ఞాపకం: ప్రాణాలను ప్రసంశల్లో పెట్టుకుని బతికే ఆర్టిస్టులెవరికైనా ఇలాంటి చావు తప్పదేమో అని నేను అన్నపుడు... నా ఆర్టిస్ట్‌ ఫ్రెండ్‌ హృదయం గాయపడింది.