Saturday, June 20, 2009

టామ్‌ అండ్‌ జెర్రీ

పక్కన పిల్లలుంటే వారి దృష్టిని మిస్టర్‌ బీన్స్‌ మీదికి మళ్లించండి. మధ్యలో పొరపాటున టామ్‌ అండ్‌ జెర్రీ తగలొచ్చు. తెలివిగా స్కిప్‌ చెయ్యండి. అదో రకం హింస. హింసను ఆనందించడం అలవాటైతే.. బోర్నవిటా పొడిలో చీటూస్‌ గుండ్లను ఒకటొకటిగా అద్దుకుని తింటూ - ఇంట్లో బేబీ డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్‌.లు తయారౌతారు. అందుబాటులో ఉన్న మమ్మీ తలను గోడకేసి కొట్టి, గుండెల పైకి ఎక్కి తొక్కేస్తారు. ‘‘చావు. చావవే చావు’’అంటూ. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌యాక్టివిటీ!
***
క్రౌర్యం ఒక ఆటయింది. పొద్దుపోని ఆట! ఊరికే ఒడ్డున ఉండి ఏం చెయ్యాలి? మనిషెవడైనా ఇటుగా వస్తే బాగుండు. నీళ్ళలోకి నెట్టేసి, ఆ దృశ్యానికి లలితా కళా తోరణం కట్టేసి, వన్‌ రుపీ వర్త్‌ పల్లీల పొట్టు ఒలుచుకుంటూ, దాన్ని ఇంకొకడి మీదికి ఊదుకుంటూ, ఆ భావప్రాప్తితో ఒక సాయంత్రం గడిపేయొచ్చు. ఫోర్‌ ప్లే తరువాయి భాగం బస్సులో ఇంటి కి వెళుతూ స్ర్తీలకు కేటాయించిన సీట్లలో. ‘‘ఎక్స్‌క్యూజ్‌ మీ’’ అని అడిగించుకునే లేవాలి. అదీ అటంటే. స్ర్తీలను గౌరవించడంలో ఇంత మజా ఉందా?! అది కూడా ఒక ఆటే. బుల్‌ఫైట్‌ లాంటి ఆట!
***
బుల్‌ ఫైట్‌ను చూడలేక గుండె చెమ్మగిల్లి, కళ్ళలోంచి బలహీనంగా కొట్టుకుంటుంటే ఒకందుకు మీరు అదృష్టవంతులు. లోపల - మీ రక్తనాళాల్లో బుద్ధుడు, జీసస్‌, గాంధీ, అమల ప్రవ హిస్తున్నారని.
ఆ మధ్య నెవెడా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఇస్మాయిల్‌ జన్‌జనీ ఏడేళ్ళు కష్టపడి, 5 మిలియన్‌ పౌండ్ల ఖర్చుతో హ్యూమన్‌-షీప్‌ను సృష్టించారు... 15 శాతం మానవ కణాలను గొర్రెలో చొప్పించి!
కానీ, బుల్‌ ఫైట్‌ను చూస్తుంటే జంతు కణాలనే మానవుడిలో ప్రవేశపెట్టవలసిన అవసరం కనిపిస్తోంది.
రాక్షసానందాన్ని టోన్‌డౌన్‌ చేసేందుకు.

సమయం: 2007 ఏప్రిల్‌ 1 (‘వార్త’ సండే)

సందర్భం: పిల్లలు చూసే ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ కామెడీ షో, పెద్దలు ఆనందించే బుల్‌ ఫైట్‌... ఒకేలా అనిపించి.

జ్ఞాపకం: ఐటమ్‌ ‘బుల్‌ఫైట్‌’ మీద కాబట్టి పెద్దగా ఆలోచించకుండా బుల్‌ఫైట్‌ ఫొటో పెట్టేశాం. కానీ అది సరైన నిర్ణయం కాదనిపించి ఫొటో మార్చబోయేలోపు కాపీలు ప్రింటయ్యాయి. పాఠకులు కొందరు బాధపడుతూ ఉత్తరాలు రాశారు... ‘‘మీరు చేసిందేమిటి? ఇలాంటి ఫొటోను అచ్చువేసి పంపిణీ చేయడం కూడా క్రౌర్యమే కదా’’ అని. అందుకే ఇప్పుడా ఫొటోకి బదులుగా 'పెటా' ఫొటో.