Monday, June 22, 2009

ఫుల్‌ వాల్యూమ్‌

ఏదైనా చేసేయగల శక్తిమాన్‌లం కదా మన మగాళ్ళం... ఎందుకని ఇంత హాయిగా నవ్వలేం?! ఈ భూగ్రహం మీద వేరే తోడు లేకుండా, రాక్షసులతో కలిసి జీవిస్తున్నామన్న భయమే లేకుండా ఎంత బాగా నవ్వుతారో చూడండి వీళ్ళు. సాయంత్రం ఆరైనా... ఉదయం విచ్చుకున్న నవ్వే అదింకా! ఎలా సాధ్యం? చికాకుల్లో పుష్పించడం, చింతలమానై కూడా చిగురించడం! ఎలా సాధ్యం? అదే ఇంటికి, అదే వంటకి వెళ్ళాలని తెలిసీ, ఆఫీస్‌ మిరర్‌ల్రో ఫ్రెషనప్‌ కావడం!
కాళ్ళు గుంజి, భుజాలు లాగేస్తున్నా ఆ ప్రసన్న వదనం... హ్యాండ్‌బ్యాగ్‌తో, కూరగాయల క్యారీ బ్యాగ్‌లతో అలా శకాలు శకాలు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఉతుకుతున్న బట్టల్లోకి సబ్బులా జారిపోయిన వెన్నెముకను వెతుక్కుంటున్నప్పుడూ అదే ప్రసన్నత! నడుం నొప్పిని నీలిమందుతో కప్పేసినట్లు తెల్లటి పువ్వులాంటి ప్రసన్నత!!మగధీరులం కదా మనమెందుకు అలా ఉండలేం? అంత సౌమ్యంగా, అంత శాంతంగా, అంత పెద్దరికంగా, అంత పరిపూర్ణంగా ఎందుకు ఉండలేం? వేళకు వడ్డించిన విస్తరి ముందు కూడా అప్పడం మొహమేసుకుని కూర్చుంటాం మనం... ఉలవచారెందుకు చెయ్యలేదని. అప్పడం పటపటలాడితే కదా ఆవిడకు అర్థమయ్యేది. ఆవిరికి మెత్తగిల్లిన అప్పడంలా ఉండిపోతాం, ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా. పిల్లల స్కూల్‌ డైరీలో చిన్న సంతకం చెయ్యడం కూడా మనకు పెద్ద పనే. బర్రున బాల్‌పెన్‌తో గీకి పారేసి ‘‘హమ్మయ్య’’అని రిలీఫ్‌ పీలౌతాం!
***
భగవంతుడు ముందుగా ఆడమ్‌నే ఎందుకు సృష్టించాడంటే ‘పర్‌ఫెక్షన్‌’ కోసమట. ఈవ్‌ని దోషరహితంగా మలిచేందుకు ఆడమ్‌లోని లోపాలు ఆయనకు ఉపయోగపడ్డాయని ఒక సెటైర్‌. ఆడమ్‌ ఒళ్ళొంచేవాడు కాదేమో. ఆ అంశ మనలో ఉన్నట్లుంది. పనులన్నీ ఆడవాళ్ళకు వదిలేసి చేతులూపుకుంటూ జీవితాల్ని గడిపేస్తున్నాం. ఇక మగవాళ్ళ అవసరం ఏమిటి? ఏమీ లేదు. ముందు ముందు అసలే ఉండదని కూడా అర్థమౌతోంది. ఆ మధ్య న్యూ క్యాజిల్‌ యూనివర్శిటీ పరిశోధకులు స్ర్తీల ఎముకల మూలుగలోని మూల కణాల నుంచి వీర్యకణాలను సృష్టించారు! వాటితో అండాల ఫలదీకరణ విజయవంతంగా జరిగినట్లయితే పురుషుడి సహకారం లేకుండానే స్ర్తీలు పిల్లల్ని కనొచ్చు. మగవారి కోసం ఇక్కడొక బీభత్స భయానక ట్విస్ట్‌ సిద్ధంగా ఉంది. పురుషుడి వీర్య కణాల్లో ‘వై’ క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి అవి వెళ్ళి స్ర్తీలోని ‘ఎక్స్‌’ క్రోమోజోములతో కలిసినప్పుడు ఆడపిల్లగానీ (ఎక్స్‌, ఎక్స్‌), మగపిల్లాడు కానీ (ఎక్స్‌, వై) పుట్టే అవకాశం ఉంటుంది. అయితే స్ర్తీల ఎముకల నుంచి సృష్టించిన వీర్య కణాలలో ‘ఎక్స్‌’ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి కనుక ‘ఎక్స్‌’ కి ‘వై’ కలిసే ఛాన్స్‌ లేక ఆడపిల్లలు మాత్రమే పుడతారు. అలా ఈ భూమ్మీద మగ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని శాస్ర్తవేత్తలు సంకేతపరుస్తున్నారు. 1914లోనే చార్లెట్‌ పెర్కిన్స్‌ గిల్మన్‌ అనే రచయిత్రి ‘హెరాల్డ్‌’ అనే పుస్తకంలో ఇటువంటి ‘అద్భుత ప్రపంచాన్ని’ ఊహించారు.
పురుషుడు లేని ప్రపంచంలో యుద్ధాలు, ఆధిక్యాలు ఉండవు. ఉలవచారు చెయ్యలేదని మూతి ముడుచుకునే భర్తలూ ఉండరు. అప్పుడిక ఫుల్‌ వాల్యూమ్‌. కుడియోంకా హై జమానా!

సమయం: 2007 సెప్టెంబర్‌ 23 (‘వార్త’ సండే)

సందర్భం: ‘పర్జానియా’ చిత్రానికి అవార్డు అందుకుంటున్న సందర్భంలో నటి సారిక నవ్వును చూశాక. (బ్లాగులో పెట్టడానికి ఆ ఫొటో మళ్ళీ దొరకలేదు).

జ్ఞాపకం: ఆఫీస్‌కి చాలా ఫోన్‌లు వచ్చాయి. ఐటమ్‌ బాగుందని.
విజయవాడ నుండి ... ఒక గృహిణి ఫోన్‌ చేశారు - ‘‘మిమ్మల్ని చూడాలని ఉంది’’అంటూ.
‘‘మీకు తెలిసిన ముఖమే’’అని చెప్పాను.
‘‘ఎలా?’’ అని ఆవిడ అడిగారు.
‘‘నేనూ వన్నాఫ్‌ ది అప్పడమ్స్‌’’ అని చెప్పాను. అప్పడం లేని ఇల్లు ఉండదన్న నమ్మకంతో.