Wednesday, June 24, 2009

పడుతున్న ఈ బాధ... పెడుతున్న ఏ పువ్వుదో!

పాతేడుపే. వేసవి పూల ఉష్ణోగ్రతలో ఆవిడెవర్నో ఐదు నిమిషాలుగా ప్రేమిస్తున్నా. సిగ్గు లేకుండా నేనిప్పుడు చెప్పడం ఏమిటంటే, నా కెవరూ అక్కర్లేదు. నేను, తను, తనలో నాకు నచ్చిన కాలర్‌ బోన్స్‌... కొంతకాలం కలిసి జీవించాలి. కంఠానికి అటూ ఇటూ ఉన్న ఆ పెళుసు గంధపు చెక్కల్ని నా నాసికతో అరగదీసి పట్టేందుకు గిన్నెడు రాత్రులు కావాలి. నింద వేయడం కాదు, తనెవరో నిర్దయగా నా ప్రపంచాన్ని మింగేశారు! నాకొకటి అనిపిస్తోంది. రాజ్‌ ట్రావెల్స్‌ వారి 1, 09, 999 రూపాయల స్కీమ్‌లో ఆమెను పది రోజుల పాటు ఐరోపా అంతా తిప్పుకు వస్తే! ఎక్స్‌లెంట్‌.
ఓవర్‌నైట్‌ క్రూయిజ్‌లో నేను తను.
క్యూకెనాఫ్‌ గార్డెన్స్‌లో నేను తను.
మంచు పరుచుకున్న టైట్లిస్‌ పర్వతంపై నేను, తను.
ఐఫిల్‌ టవర్‌పై నేను, తను.
జూన్‌లో సోల్డవుట్‌ కాకుండా 10, 11 ఫ్లయిట్‌ సీట్లు మిగిలే ఉన్నాయట! దైవ సంకల్పం. హోటల్‌ గది రిజిస్టర్‌లో ఆమె పేరు, పక్కన వైఫాఫ్‌ గా నా పేరు. ఇదీ దైవ సంక ల్పమేనా? కాకపోవచ్చు. పెళ్ళిళ్ళొక్కటే కదా స్వర్గంలో నిర్ణయమయ్యేది. దొంగచాటుగా మన పేరు పక్కన రాసుకుని చూసుకునే పేర్లను కూడా దేవుడే నిర్ణయిస్తే ఆదర్శ దాంపత్యమంత సొగసుగా ఏడుస్తాయేమో ఈ ప్రేమలు కూడా! ముందసలు ఆమె పేరేమిటో కనుక్కుని, సెల్‌ఫోన్‌లో హౌస్‌ఫైఫ్‌ని రీప్లేస్‌ చేయాలి. ఆ తర్వాత, ఆఫీస్‌లో చచ్చేంత పని ఉన్న ఒక అర్థవంతమైన సాయంకాలం ఆమె చేత ఆసిఫ్‌ జాహీ టిక్కా తినిపించాలి. తినడం రాకుంటే ఆ పెదవులకు డిమ్‌లైట్‌లో అన్న ప్రాశన చేయించాలి. ‘‘ఇక చాలు’’ అంటున్నా, ‘‘నా కోసం ప్లీజ్‌’’ అంటూ చికెన్‌ మంచూరియా తెప్పించాలి.
ఆరె! ఆమె వెళ్ళిపోతోంది! ఎవరి బండి మీదో, భుజం మీద చెయ్యేసి. దేవుడా... నిన్న మా పనమ్మాయీ ఇదే పని చేసింది. గిన్నెల మధ్యలో పడి వున్న నా గుండెను చూడనైనా చూడకుండా, రుద్ది రుద్ది డిష్‌లో ఎత్తి పడేసి, పూలకొంగుకి చేతులు తుడుచుకుంటూ పగటి చుక్కల్లో కలిసిపోయింది. ఉప్పల్‌ డిపో కండక్టరమ్మ, అకౌంట్స్‌లో కళ్ళద్దాలమ్మాయ్‌, ఆంధ్రా బ్యాంక్‌ డయానా, మిసెస్‌ అభిషేక్‌ బచన్‌... అంతా ఇంతేనా?!
చెలియా, చెలియా, చేజారి వెళ్ళకే... సఖియా, సఖియా, ఒంటరిని చేయకే.
***
సంస్కృతి ఏదైనా - అది... స్ర్తీలో చక్కగా ఇమిడిపోతుందేమిటో! ఆదియందు, అంతంలోనూ దేవుడు మాత్రమే ఉంటే సరిపోయేది. మధ్యలో ఇంత హింస లేకుండా. దేవుడికి నమస్కారం. ఇప్పుడిక స్ర్తీలకు కూడా.

సమయం: 2007 మే 6 (‘వార్త’ సండే)

సందర్భం: అస్సాం ‘రంగోలి బిహు ఉత్సవంలో ఫ్యాన్సీ డ్రెస్‌ నృత్యానికి సిద్ధమైన బోడో గిరిజన యువతులను చూశాక.

జ్ఞాపకం: ‘పడుతున్న ఈ బాధ... పెడుతున్న ఏ పువ్వుదో!’’ అని టైటిల్‌ పెట్టాక అనుమానం వచ్చింది... అర్థంకాదేమోనని. ఎదురుగా ‘చెలి’ డెస్క్‌లో పూడి శ్రీనివాస్‌ కనిపిస్తే... టైటిల్‌ని మాత్రమే వేరుగా చిన్న పేపర్‌ ముక్క మీద రాసి చూపించి అడిగాను, దీనర్థం ఏమిటని? కాసేపు ఆలోచించి, కన్ఫ్యూజన్‌గా ఉందన్నాయ్‌ అన్నాడు. పక్కనే శ్యామల మేడమ్‌ ఉంటే ఆవిడకు చూపించి అడిగాను. నా భావమూ, ఆవిడ చెప్పిన అర్థమూ సరిపోలాయి. అక్కడి నుంచి మా డెస్క్‌కి వెళుతుంటే దుర్గాంబగారు ఎదురయ్యారు.నేను వెళ్లాక, టైటిల్‌ విషయం తెలుసుకుని...‘‘పూల సంఖ్య పెరిగిందా?’’ అని అన్నారట నవ్వుతూ. (పై ఫొటో ఆనాటిది కాదు. ‘వార్త’లో ఉండగా జాగ్రత్త చేయకపోవడంతో చాలా ఫొటోలు మిస్ అయ్యాయి.)