Friday, June 26, 2009

ప్రో-లైఫ్‌

తల్లీ.. దండం.
నీ కాళ్ళకు దండం.
విశ్వాన్ని శ్వాసిస్తున్న నీ హృదయ స్పందనకు దండం.

శిల్పీ... నీక్కూడా! శిరస్సు వెనుక ప్రభామండలం లేని సృజనకారుడెవరైనా ఇంత డివినిటీని మలచగలడా?! ఎక్కడున్నావ్‌? ఉలి అంచుకు అంటిన మాతృత్వంతో ఇంకో శిలను లాలించేందుకు వెళ్ళావా? తట్టుకోగలమా ఇంతింత కాంతిని. మా దృష్టి దోషాన్ని సవరించి వెళ్ళరాదా.. నీ అంతర్నేత్రాలను పెకిలించి ఇచ్చి.
ఆచ్ఛాదనను దాటి చూడలేని అపరాధ భావనల చేత పావనులమైన వాళ్ళం. నీ తేజస్సుతో పోటీకి.. మానవ భ్రాంతులు మిణుకు మిణుకు మంటున్నాయి! మనసు మనక మసగ్గా మూలుగుతోంది. కళాత్మా.. బ్రహ్మ సాంగత్యం నీది. గర్భకుహరంలోకి నువ్వొక్కడివే తొడ్కొని వెళ్ళగలవ్‌. వెంట వస్తాం. దివ్య దర్శనం అయ్యే వరకు చెయి వదలకు. మా అహం చావాలి. అప్పుడే కదలాలి.
***
డేనియల్‌ ఎడ్వర్డ్‌.. జీవితాన్ని ప్రేమిస్తాడు. గర్భస్థ శిశువు జీవితేచ్ఛను ప్రేమిస్తాడు. అబార్షన్లను వ్యతిరేకించే ప్రో-లైఫ్‌ ఉద్యమకారుడతడు. బాధ్యత గల శిల్పి. కనెక్టికట్‌లోని తన స్టూడియోలో కనిపించే ఇలాంటి కుడ్య చిత్రాలు.. అవాంఛనీయ జననాలు వద్దనుకునే వారిని చికాకు పరుస్తాయి. డేనియల్‌ వాటికి ‘మాన్యుమెంట్‌ టు ప్రో-లైఫ్‌: ది బర్త్‌ ఆఫ్‌ సీన్‌ ప్రిస్టన్‌’ అని పేరు పెట్టారు. పై బొమ్మలోని అమ్మాయి.. పాప్‌ గాయని బ్రిట్నీ స్పియర్స్‌. ఆమెకు నెలలు నిండిన సందర్భాన్ని డేనియల్‌ ఇలా ఒక సామాజిక సందేశం కోసం ఫ్రీజ్‌ చేశారు. సీన్‌ ప్రిస్టన్‌.. బ్రిట్నీ తనయుడు.

సమయం: 2006 ఏప్రిల్‌ 9 (‘వార్త’ సండే)

సందర్భం: డేనియల్‌ ‘ప్రో-లైప్‌’ ఉద్యమం గురించి తెలిసినప్పుడు.

జ్ఞాపకం: గుడిపాటిగారు డైనమిక్‌. మా ఇన్‌చార్జ్‌. అయితే పై ఫొటోని అప్రూవ్‌ చేయడానికి ఆయన కొంత ఆలోచించారు. ఎడిటర్‌గారి ఒపీనియన్‌ అడిగితే బాగుంటుందని సజెస్ట్‌ చేశారు. ఎడిటర్‌ టంకసాల అశోక్‌. ‘‘మీరే ఆలోచించండి’’ అన్నారు అశోక్‌ గారు. అలా అన్నారంటే - ఆయనకు ఇష్టం లేదని. ఆవేళ డెడ్‌లైన్‌. త్వరగా పేజీలు పంపించమని ‘ప్రొడక్షన్‌’ నుంచి ఫోన్లు. ఆల్టర్నేట్‌ లేక, ధైర్యం చేసి ఈ ఫొటోను ఉంచేశాం!
ఇష్యూ బయటికి వచ్చాక... నన్ను అసహ్యించుకోడానికీ, నన్ను ద్వేషించడానికి, నన్ను తిట్టడానికి, నాపై కంప్లయింట్‌ చేయడానికి, లంచ్‌ అవర్‌లో నా క్యారెక్టర్‌ని ఎనలైజ్‌ చెయ్యడానికి, నాతో కలిసితిరిగే వారి శీలాన్ని శంకించడానికి మా ఆఫీసులో చాలామందికి ఒక కారణం దొరికింది.
గుడిపాటిగారు ఏమీ అనలేదు. అశోక్‌గారు ఏమీ అనలేదు. బయటి నుంచి ఒక ఫోన్‌కాల్‌ వస్తే ఆ కాల్‌ని నేనున్న చోటికి రీడెరైక్ట్‌ మాత్రం చేయించారు.
‘‘మర్యాదస్థులు చదివే పుస్తకంలో ఇలాంటి ఫొటోలు ఏమిట’’న్న గద్దింపు అది.
వివరణ ఇచ్చే టైమ్‌ లేక ‘‘ఇక ముందు జాగ్రత్త పడతాం’’ అని చెప్పాను. వదల్లేదు.
‘‘అలాగే జాగ్రత్త పడుదురుగానీ, జరిగిపోయిన తప్పు సంగతేమిటి’’ అని మళ్ళీ గద్దింపు. నష్టపరిహారంగా యు.ఎస్‌.కరెన్సీలో కొన్ని లక్షల డాలర్లు ఇస్తేగానీ వదిలేట్టు లేరాయన!
‘‘ఫొటో ఒక్కటే చూశారా? ఐటమ్‌ కూడా చదివి ఉండాల్సింది’’ అనబోయి - ‘‘ఇక ముందు ‘వార్త’ మిమ్మల్ని నొప్పించదు. ఐ స్వేర్‌’’ అన్నాను.