Monday, June 29, 2009

ఆ‘గే’ట్టు లేరు!

మీ ఇష్టం. ప్రేమించుకోండి. సీతాకోక చిలుకల పైటల్ని వదిలి, గరుకు గడ్డాల్ని నిమురుకోవడంలో ఆనందం ఉందనిపిస్తే ఆలాగే. సమస్య ఏమిటంటే మీ పెళ్ళికి మేం రావడం! వచ్చి ఏమని దీవించాలి? ‘‘అక్కర్లేదు మా పెళ్ళి మమ్మల్ని చేసుకోనిస్తే చాలు’’ అనేనా మీరనడం! మీ ఆంతరంగిక విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోడానికి కాస్త ఇబ్బందిగా ఉందబ్బా. ఇప్పుడూ... ఒక డౌట్‌ ఏమిటంటే - ఉఫ్‌, ఏం లేదు లెండి. నేనింకో పిల్లను ప్రేమిస్తే మాయావిడ తిడతాది కదా. ఇదీ అంతే. భూమ్మీద ఇంతమంది ఆడపిల్లలు ఉండగా, వారికి కాబోయే భర్తల్ని మీరిలా ముందే కట్టేసుకోవడం ఏమిటి? అదీ కాకుండా, మీరు పెళ్ళి చేసుకున్నాక రెండో తరగతి చదువుతున్న మా అబ్బాయికి కనిపించకుండా తిరగ్గలరా? వాడు నాకు మల్లే నిరాకార మనస్కుడు కాదు. ఆంటీ ఆంటీలా, అంకుల్‌ అంకుల్లా లేకుంటే అక్కడిక్కడే నవ్వేస్తాడు. మీరూ రైటే, వాడూ రైటే. సర్దిచెప్పాలని చూస్తే మీరూ వినరు, వాడూ వినడు. ఉఫ్‌, ఇప్పుడూ... ఏం లేదు లెండి.
***
సమయం: 2006 అక్టోబర్‌ 15 (‘వార్త’ సండే)

సందర్భం: అబ్బాయిలు అబ్బాయిల్ని, అమ్మాయిలు అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియా స్టేట్‌ కోర్టు తీర్పు చెప్పాక, శాన్‌ఫ్రాన్సిస్కోలో సేమ్‌సెక్స్‌ మ్యారేజ్‌ ప్రదర్శన జరిగింది. మేం పెళ్ళి చేసుకుంటే మీకొచ్చిన నష్టం ఏమిటని ప్రదర్శనకారులు అడుగుతున్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు! చట్ట సమ్మతం కాదని అధికారులు అంటుంటే, కొత్త చట్టం తెమ్మని వరూవరులు, వధూవధువులు కోరుతున్నారు. ఆ పరిణామాలపై ఒక ఆలోచన.

జ్ఞాపకం: అబ్బాయి అబ్బాయి ముద్దు పెట్టుకుంటున్న ఫొటోకి రైటప్‌ రాయవలసి వస్తే అది ఎలా ఉండాలి? పోనీ, ఎలా ఉండకూడదు? ప్రపంచంలోని ఏ విలువా... తీర్పులకు లోబడివుండేది కాదన్న విషయం మర్చిపోయి, అప్పుడప్పుడూ తటాలున ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చేస్తాం. అలా ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ పై రెండు ముక్కలు రాసి... నా పక్కన, సిస్టమ్‌ ముందు కూర్చుని ఉన్న రమేశ్‌గారికి చూపించాను... కొత్త యాంగిల్‌ ఏదైనా ఉంటే చెప్తారని. చదివారు. చదివి ఏమీ చెప్పకుండానే తన పాటలో తను పడిపోయారు. ప్రస్తుతం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ‘నవ్య’లో ఉన్నారు. చెట్టంత మనిషి. జంటిల్మన్‌. ‘వార్త’లో ఉన్నపుడు ఆయన సిస్టమ్‌లోని ‘ఐ-ట్యూన్స్‌’నుంచి మంచి మంచి పాటలు వినిపించేవి. ‘‘నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు / నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను’ అనే చరణం కోసం ఆయన్ని వేధించేవాడిని.
‘‘ఎందుకంత ఇష్టం?’’ అని అడిగారు ఒకరోజు.
‘‘ఆచార్య ఆత్రేయ అంటే ఇష్టం’ - అని సగం నిజం మాత్రమే చెప్పాను.
***
ఐటెం త్వరగానే అయింది కానీ, టైటిల్‌ దగ్గర బ్రేక్‌ పడింది. గంటలు గడుస్తున్నా తట్టలేదు. ‘పాత్రికేయ’గారిని పట్టుకున్నాను... మంచి టైటిల్‌ చెప్పమని. కొంచె టైమ్‌ ఇచ్చి, వెళ్ళి అడిగాను. ఏవో రాశారు. ఆయనకే నచ్చలేదు. పాత్రికేయగారు ముందు ఏదో రాసి, దాన్ని కొట్టేసి, ఆ కాగితాన్ని ఉండచుట్టి డస్ట్‌బిన్‌లోకి విసిరేస్తే అది ఆయన టేబుల్‌ దగ్గరే పడివుంటే - దాన్ని చూసి - ‘‘అందులో ఏమైనా రాశారా?’’ అని అడిగాను. అవునన్నారు. తీసి, మడత విప్పాను. సరిగ్గా సరిపోయే టైటిల్‌!!! ఆ‘గే’ట్టు లేరు! అని.