Tuesday, June 30, 2009

ఐ జస్ట్‌ కాంట్‌ స్టాప్‌ లవింగ్‌

ఒక జీవితం... రెండు ప్రయాణాలు!
ఒకటి బయటికి, ఒకటి లోపలికి.
వస్తున్నానా? వెళుతున్నానా? ‘మూన్‌వాక్‌ ’ డాన్స్‌లా ఒక భ్రాంతి.
నడక ముందుకి, అడుగులు వెనక్కి!
వెనక్కి వెనక్కి... వెనక్కి వెనక్కి... ఇంకా వెనక్కి... మదర్‌ ఎర్త్‌లోకి.
‘‘హీల్‌ ద వరల్డ్‌ ... మేకిట్‌ ఎ బెటర్‌ ప్లేస్‌...’’
అమ్మ కోసం పాడతా, ఆమె గర్భంలోంచే.
షి ఈజ్‌ వండర్‌ఫుల్‌. నేనెప్పటికీ పాడుతూనే ఉంటా.‘‘ఫర్‌ యు అండ్‌ ఫర్‌ మీ...అండ్‌ ది ఎంటైర్‌ హ్యూన్‌ రేస్‌’’
***
పాటకు ఉన్నట్లే ప్రతి జీవితానికీ ఒక థీమ్‌ ఉండాలి. థీమ్‌లో ప్రేమ ఉండాలి. జీవితంపై ప్రేమ, జీవన పోరాటంపై ప్రేమ, పిల్లలపై ప్రేమ, ప్రొఫెషన్‌పై ప్రేమ, సౌందర్యంతో దహించివేస్తున్న స్ర్తీలపై ప్రేమ... ఉండాలి. బీట్‌ మన ఇష్టం. వినేవాడే వింటాడు. వినలేనివాడు ‘‘షటప్‌’ అని చెవులు మూసుకుంటాడు. మన తీగలేం తెగిపోవు. కంఠంపై పారదర్శకంగా, లోపలి నుంచి పాట కనిపించేలా ఉబ్బిన తంత్రులు నువ్వెన్ని డెసిబెల్స్‌తో జీవితాన్ని ప్రేమిస్తున్నావో చెబుతాయి. జీవితంలోని ప్రతి వ్యక్తీకరణలో జీవితానికి అర్థం ధ్వనిస్తుంది. అనంత రూపాల్లో నిరంతరంగా అది ధ్వనిస్తూనే ఉంటుంది. ప్రేమకోసం మన మీ లోకంలోకి వచ్చామని, ప్రేమ కోసం ఈ లోకాన్ని వదలి వెళ్తున్నామని అనుకుంటే - మధ్యలో ఇంత ద్వేషం ఉండదు. అంతిమ జీవితాదర్శం... ప్రేమ!హృదయంలోంచి వచ్చే అలాంటి ప్రేమను ఒకప్పుడు కలగన్నాను. చుక్కల్ని దాటి వెళ్ళి అక్కడ మేల్కొన్నాను. కానీ, పై నుంచి చూస్తే - ‘బ్లడ్‌ ఆన్‌ ది డాన్స్‌ ఫ్లోర్‌’!! ఇన్ని గాయాలేమిటి భూమికి? ఇంత రక్తం ఏమిటి? భూమి వంటి స్వర్గం... విశ్వంలో మరెక్కడైనా ఉందా? ఎందుకని ద్వేషంతో, కోపంతో ఒకరివెంట ఒకరం పడుతున్నాం. ఎవరిని తోసుకుని ఎక్కడికి వెళ్లడం కోసం?‘‘డిడ్‌ యు ఎవర్‌ స్టాప్‌ టు నోటీస్‌ ది క్రయింగ్‌ ఎర్త్‌? ది క్రయింగ్‌ షోర్స్‌?’’
***
తోచక నన్ను హర్ట్‌ చేస్తుండేవారికి... బాధతో నేనరిస్తే అదొక మెలడీ! నేనొక కామెడీ.డికెన్స్‌ గుర్తుకొస్తున్నారు.
‘‘ఇట్‌ హాజ్‌ బీన్‌ ద బెస్ట్‌ ఆఫ్‌ టైమ్స్‌, ది వరస్ట్‌ ఆఫ్‌ టైమ్స్‌’’.
భూమ్మీద నాకు స్వర్గాన్ని చూపిన మనుషులున్నారు. నరకాన్ని చూపిన మనుషులూ ఉన్నారు.
అమ్మ, ఆల్బమ్స్‌, పిల్లలు, ప్రజాభిమానం, ప్రణయం... నా బెస్ట్‌ ఆఫ్‌ టైమ్స్‌.
నాన్న, నా బాల్యం, నా అప్పియరెన్స్‌, అప్పులు, అనారోగ్యం, మీడియా...నా వరస్ట్‌ ఆఫ్‌ టైమ్స్‌.
సంతోషం కన్నా బాధే ఎక్కువగా జీవితాన్ని నడిపిస్తుంది. నా జీవితానికీ బాధే ఇంధనమయింది.
నాన్న!?!
ఆయనేమిటో నాకు అర్థం కాకపోవడం నా జీవితంలోని పెద్ద విషాదం. పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే అధికారంతో ఆయన నన్ను ఆడుకోనివ్వలేదు. బాగా జ్ఞాపకం! దక్షిణమెరికా బయల్దేరుతున్నాం ఒకరోజు. సామాన్లన్నీ ప్యాక్‌ చేశారు. కారు సిద్ధంగా ఉంది. దుఃఖంతో నేనొక చోట దాక్కున్నాను. వెళ్ళడం ఇష్టం లేదు. ఆడుకోవాలని ఉంది నాకు. ఆ మాట చెప్పలేను. పిల్లలపై ఉండే ప్రేమతో పెద్దవాళ్ళు కొన్ని పనులు చేయలేరు. అధికారంతో మాత్రం ఏమైనా చేయగలరు. మా నాన్న నన్నెప్పుడూ ప్రేమగా చూడలేదు. కళ్ళ నిండా అసహ్యంతో చూశారు.
ఇప్పటికీ - రికార్డింగ్‌ స్టుడియోకి వెళ్ళేదారిలో మలుపు దగ్గర నా కారు స్లో అవుతుంది. పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. ‘‘నేనెందుకు పనికి వెళ్ళాలి’’ అనిపిస్తుంది. ప్రపంచంలోని పిల్లలంతా ఒకేలా ఉంటారు. ఒకేలా ఆలోచిస్తారు. ఒకేలా నవ్వుతారు. కానీ వారి బాల్యాన్ని వేర్వేరుగా మార్చేస్తారెందుకీ నాన్నలు? నాన్న నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. నన్ను కురూపి అన్నాడు. చీకట్లో మొహం దాచుకుని ఏడ్చాను. అద్దం చూసుకోవాలంటేనే భయం. అందులో నా ముఖం కనిపించదు. నన్ను ఛీ.. ఛీ...అంటున్న నాన్న ముఖం కనిపిస్తుంది! హాలివుడ్‌ కూడా నన్ను మా నాన్నలా వెంటాడింది. నా మొటిమల ముఖాన్ని చూడ్డానికి నాన్న ఏరోజూ ఇష్టపడలేదు. రంగుమారిన నా చర్మం హాలీవుడ్‌లో సేమ్‌ ఓల్డ్‌ హాట్‌ టాపిక్‌ కాని రోజంటూ లేదు! స్కిన్‌ డిజార్డర్‌ మనిషి చేసుకున్న పాపమా? నన్నెవరూ కనికరించలేదు. సర్జరీ చేయించుకున్నానని తప్పు పట్టారు. ఒకమాట అడుగుతాను. హాలీవుడ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న వాళ్ళందరూ రెండు రోజుల పాటు ఏదైనా విహార యాత్రకు వెళితే ఆ పట్టణంలో ఒక్క మనిషైనా మిగులుతాడా? నేను బ్లాక్‌ అమెరికన్‌. ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాను. దేశవాళీ రంగును మార్చుకునే అగత్యం నాకేమిటి? మీడియా నమ్మలేదు. నా గురించి తను అనుకున్నవన్నీ రాసింది. నా గురించి జనం ఏమనుకుంటే బాగుంటుందో ఊహించి అది కూడా రాసింది. ప్రింట్‌లో వచ్చినంత మాత్రాన అది ప్రవచనం అయిపోతుందా? ఒక టాబ్లాయిడ్‌ నన్ను ‘‘వాకో జాకో’’ అంది. జాక్సన్‌కి పిచ్చెక్కిందని ఆ పత్రిక ప్రచారం. ఆ మాటకు నన్ను క్రుంగదీసింది. జాక్సన్‌ కూడా మనిషే. వాడికీ హృదయం ఉంటుందని వీళ్ళెందుకు అనుకోరు!
***
పిల్లల్ని హింసించానట!!!
‘‘వియ్‌ సింగ్‌ సాంగ్స్‌ ఫర్‌ ది విషింగ్‌... ఆఫ్‌ దోజ్‌ హు ఆర్‌ కిస్సింగ్‌...బట్‌ నాట్‌ ఫర్‌ ది మిస్సింగ్‌’’.
బాల్యాన్ని మిస్‌ చేసుకున్నవాడు, ‘లాస్ట్‌ చిల్డ్రన్‌’ కోసం ఉద్యమగీతం ఆలాపించినవాడు జాక్సన్‌! ఎందుకలా చేస్తాడు?పిల్లల మొహంలో నాకు దేవుడు కనిపిస్తాడు. అమాయకమైన ఆ నవ్వుల్లో నాకు దైవ దర్శనం అవుతుంది. పిల్లలు నాకు ప్రాణం. వారిపై చెయ్యెత్తడం కన్నా నా మణికట్లను కోసుకోవడం తేలిక నాకు. ఎవరూ నాలా బాల్యాన్ని కోల్పోకూడదు. ఆహ్లాదకరమైన ప్రకృతిలో పిల్లలంతా స్వేచ్ఛగా ఆడి పాడాలి. ఏనుగులు, జిరాఫీలు, మొసళ్ళు, తాబేళ్ళు, పులులు, సింహాలు... వీటన్నిటినీ వారు చూడాలి. వాటి తోకలు పట్టి, మీసాలు పట్టి లాగాలి. వారు అవన్నీ చేయడానికి పక్కనే మనం ఉండాలి. సంపాదనను, పేరు ప్రఖ్యాతులను పక్కనపెట్టి కాసేపైనా వారితో గడపాలి. పిల్లలు, మనం... దిండ్లతో యుద్ధాలు చేసుకోవాలి.పిల్లలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ అదృష్టం లేనివారు, పిల్లలపై నాకున్న ప్రేమను తమ ప్రయోజనాలకు అడ్డుపెట్టుకున్నారు.
***
జీవితంలోని కల్లోల దశల్లో... పాట నన్ను నిలబెట్టింది.నేను ఇష్టపడే నా ప్రత్యర్థులు, నేను ఆరాధించిన స్ర్తీలు నా కోసం నిలబడ్డారు. మనసు గాయపడినప్పుడు నా రికార్డింగ్‌ స్టుడియో నాకు లేపనం అద్దింది. ‘జీబీ’ల బ్రిలియెంట్‌ మ్యూజిక్‌ కట్టు కట్టింది. నిర్జీవన క్షణాల్లో నా కుటుంబం నాకు పునరుజ్జీవనం ప్రసాదించింది. నా పిల్లలను నన్ను ముద్దాడారు. బ్రూక్‌ షీల్డ్‌, డయానా రాస్‌, ఎలిజబెత్‌ టేలర్‌... నా తల నిమిరారు. వారి తలపులతో నేను నా బెడ్‌ను షేర్‌ చేసుకున్నాను. మంచం మీద మన పక్కన ఇంకొకరిని పడుకోనివ్వడానికి ఎంత ప్రేమ ఉండాలి? అంత ప్రేమ కావాలి ప్రపంచానికీ, ప్రపంచాన్ని ప్రేమించడానికీ. ‘‘ఐ జస్ట్‌ కాంట్‌ స్టాప్‌ లవింగ్‌ ద వరల్డ్‌’’.
ద్వేషం నిండి వున్న ప్రపంచంలో ధైర్యంగా మనం... ఆశలు మిగిల్చుకోవాలి.
అపనమ్మకం నిండి ఉన్న ప్రపంచాన్ని... తప్పనిసరిగా మనం విశ్వసించాలి.
డోంట్‌ స్టాప్‌... టిల్‌ వియ్‌ గెట్‌ ఎనఫ్‌.