Wednesday, July 1, 2009

టూర్‌

ఆఖరి మగ చేపను కూడా తోడేసి, మగువల్ని నీళ్ళపై విహారానికి పంపి చూడండి... మళ్ళీ ఒడ్డుకు చేరేందుకు ఇష్టపడతారేమో. ఊహు. అట్నుంచటే. మానస సరోవరంలోకి, హిమాలయ మేఘాల్లోకి, అక్కడి నుంచి దిక్కుల్లోకి, ఆ పైన చుక్కల్లోకి.
రమ్మన్నా తిరిగి వస్తారనా? జాబిల్లి కోసం చంటి పిల్లల్లా మగాళ్ళెంత ఏడ్చి మొత్తుకున్నా! డాడీల చంకనెక్కి అద్దంలో చూసుకోవాలిక సొంత అమ్మనైనా. అమ్మ కూడానా?! వెళ్ళదా మరి! రోజువారీ రోటి పచ్చళ్ళ తయారీ మనోవికాస కేంద్రంలో చిటికెడు ఇంగువ, పది కాయల ఎండుమిర్చి, అర చెంచా ఆవాలు, సరిపడినంత ఉప్పు, చిన్న గరిటెడు నూనెతో ఎన్ని జన్మలపాటు దొండకాయ పికిల్‌ చేసి వడ్డించగలరు ఆవిడైనా, విసుగు విరామం లేకుండా.నాలుగ్గోడల నడుమ ఇరవై నాలుగ్గంటల ప్రదక్షిణ! భర్త చుట్టూ, పిల్ల గ్రహాల చుట్టూ.
ఆఫీసుల్లో మాత్రం ఎంత మంది గుట్టుగా సంసారం చేయట్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని! కదిలే ప్రీడమ్‌ లేని చోట ఉద్యోగమూ సంసారమే. ఆఫీస్‌కి వెళ్ళే దారిలో, వచ్చే దారిలో కూడా.మౌనంగా నలిగి నలిగి... నలిగి నలిగి... జీవితకాలం ఒక్కరోజే చీరలా - శరీరానికీ! ఇంటికి వచ్చీరాగానే నేరుగా బాత్రూమ్‌కి వెళ్ళి, బట్టలన్నీ లాగి పడేసి... పుట్టుమచ్చంత ఖాళీస్థలమైనా వదలకుండా ఒంటికి అంటిన కళ్ళనీ, ఒంటిని తాకిన వేళ్ళనీ, అన్నెససరీ ‘సారీ’లనీ, అర్థం లేని ‘థాంక్స్‌’లనీ, ‘లేడీస్‌ ఫస్ట్‌’ బొనాంజా ఆఫర్లనీ... చేప పొలుసుల్లా రుద్ది రుద్ది తోమేసి... మూలల్లో దాక్కుండిపోయిన మర్యాదస్థులని అంతే మర్యాదగా బైటికి రప్పించి, ఎన్ని పరిమళ భరితమైన విశిష్ట ఉత్పాదనలతో దేహాన్ని ఉతుక్కుంటే ఆ రాత్రికి నిద్రపడుతుందీ? అప్పటికీ కొలీగ్‌ ఎవరో మిగిలే ఉంటారు చెవిలో! డ్రెస్సింగ్‌ మిరర్‌ల్రో టవల్‌తో కమ్మలు అద్దుకుంటుండగా వచ్చి ‘ప్యూర్‌ బ్లాక్‌ మీదికి మెరూర్‌ కాంబనేషన్‌ మీకు బాగుంటుంది’’ అనేస్తారు. మనసులో అనుకోవచ్చు కదా సార్‌. మావారి స్కూటర్‌ వెనుక, సైడుకి కూర్చుని రయ్యిన వెళ్తున్నపుడు... నడుము పై భాగాన లేచి నిలబడే పైటంచు గొడుగులోంచి జాకెట్‌ హుక్స్‌ తీస్తుండే చూపులకీ, మీ ప్రశంసకీ తేడా ఉందా చెప్పండి. ఎందుకండీ మమ్మల్నిలా చంపుతారు... హాయిగా ఎటూ కదలనివ్వక.
***
నిజంగా చంపేస్తున్నామా? అయుండొచ్చు. ‘లుడాక్రిస్‌’లా డైనింగ్‌ టైబుల్‌పై ఒక చేత్తో నాజూకైన యంగ్‌ లేడీ లెగ్‌ని నోట్లో పెట్టుకుని, ఇంకో చేత్తో ఆ లేత కాలిపై సాల్ట్‌ పెప్పర్‌ చల్లుకుంటూ తినేయాలన్నంత క్రియేటివిటీ ఉంది మన దగ్గర.నీళ్ళనీ, పడవల్నీ, నేలనీ, ఆకాశాన్ని, గాలిని, పక్షుల్ని, అసలు పూర్తిగా వాళ్ళకు వాళ్ళని... ఎన్ని యుగాలపాటు వదిలేస్తే ధైర్యంగా వచ్చి మన సామీప్యాన్ని విశ్వసిస్తారో ఈ స్ర్తీలు!

సమయం: 2007 ఏప్రిల్‌ 22

సందర్భం: స్విట్జర్లాండ్‌ జూరిచ్‌ సరస్సులో పడవలపై యువతుల విహారాన్ని టీవీలో చూశాక.

జ్ఞాపకం: ‘‘ఎటునుంచి ఎటు వెళ్ళి ఎటొస్తారో అర్థంకాదు. మీలో మీరు ఎక్కడో మిస్సవుతుంటారు. మిమ్మల్ని మీరు వెతుక్కొలేక మాలాంటి వాళ్ళను ఏ గోతిలోనో తోసేసి వెళ్తారు. అవునా?’’ అని అప్పట్లో నాకు వచ్చిన ఉత్తరంలోని ఒక ప్రశ్న. అవునేమో.