Sunday, July 5, 2009

మగాళ్ళు మారడమే బెటర్

‘‘నువ్వు చూడకపోతే వాడెందుకు చూస్తాడు?!’’ అని అమ్మానాన్న కోపంగా అనేశాక -పదమూడేళ్ళ పిల్ల...కనీసం మరో ఐదేళ్ళపాటైనా అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో కంప్లైంట్‌ చేసే హక్కు కలిగివున్న పిల్ల...మళ్లీ జీవితంలో మనసు విప్పగలదా?
ఎట్లీస్ట్‌ -‘‘నేను చూడలేదు’’ అని నోరు తెరిచి చెప్పడానికైనా ఆ పిల్లకు ఆత్మవిశ్వాసం మిగిలి ఉంటుందా? ఆడపిల్లల ఆత్మ విశ్వాసాన్ని తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు కాలేజీలు కూడా దెబ్బతీస్తున్నాయి! ‘‘మీరెవర్నీ చూడనవసరం లేదు. టైట్‌ జీన్స్‌ వేసుకొస్తే చాలు, అబ్బాయిలు మీ వెంట పడటానికి’’ అంటున్నాయి యాజమాన్యాలు!! పోనీ ఎలాంటి డ్రెస్‌ వేసుకొస్తే టీజ్‌ చెయ్యరో చెప్పమనండి. చుడీదార్‌, సల్వార్‌ కమీజ్‌, ప్యాంటూ షర్ట్‌...ఒక్కో కాలేజీలో ఒక్కో నిబంధన. ఎక్కడైనా ఆగిందా అమ్మాయిల్ని ఏడిపించడం?!
***
నిజానికి ఆడపిల్లలు ధైర్యవంతులు. తమకు నచ్చినట్లు తాము ఉండగలరు. ఆ ధైర్యం మనకు లేదు! వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళను ఉండనివ్వం.
ఆడపిల్లలు వివేకవంతులు. ఎవరికి దూరంగా ఉండాలో వాళ్ళకు తెలుసు.ఆ వివేకం మనకు లేదు! అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు అని చెబుతుంటాం.
ఆడపిల్లలు ఎప్పటికీ తప్పు చేయరు. అమ్మానాన్న... వారి కళ్ళల్లో మెదులుతుంటారు.ఆ నమ్మకం మనకు లేదు! మూయని కనురెప్పలమై, వారికి నిద్రలేకుండా చేస్తుంటాం.
వార్డ్‌రోబ్‌ దగ్గర మనమ్మాయి కాసేపు నిలబడితే వెంటనే మనకు దడ పుట్టుకొచ్చేస్తుంది... ‘‘ఇప్పుడిది టైట్‌ జీన్స్‌లోకి మారిపోతుందా!’’అని బెంగ పెట్టేసుకుంటాం.
క్లాస్‌మేట్‌ పీటర్‌ జెడ్డా... బైక్‌ మీద ఇంటి వరకూ వచ్చి మన పిల్లను డ్రాప్‌ చేసి వెళ్తే... ఆ రాత్రి మనకు స్లీపింగ్‌ పిల్స్‌ అవసరమౌతాయి.
ఆఫీసులో ఉండగా తండ్రికో, కూరలు తరుక్కుంటుండగా తల్లికో... ఎవరో ఫోన్‌ చేసి చెబుతారు.. ‘‘మీ అమ్మాయి బస్టాప్‌లో ఎవరి చెంపో పగలకొట్టింద’’ని. ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి...కుటుంబ సభ్యురాలు కాకుండా పోతుంది!
***
ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇంత అధైర్యంగా, అపనమ్మకంగా ఉండడానికి కారణం.. తమ బంగారుతల్లులపై వారికున్న ప్రేమే. అందులో సందేహం లేదు. అయితే కట్టడి పేరుతో వారు విధించే ఆంక్షలు.. ప్రధానంగా డ్రెస్‌పై విధించే ఆంక్షలు చాలాసార్లు అర్థరహితంగా అనిపిస్తాయి.
ఏ ఇంట్లోనైనా... వయసొస్తున్న అమ్మాయి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే తొలి ఆంక్ష... డ్రెస్‌కి సంబంధించినదే అయివుంటుంది. ఒక్కోసారి పేరెంట్స్‌ ఎంత అసహాయంగా అయిపోతారంటే - అదిమిపెట్టుకున్న దుఃఖంతో ఇంటికి చేరిన అమ్మాయిని గుండెకు అదుముకుని ఓదార్చవలసింది పోయి, ‘‘లంగాఓణి వేసుకుని వెళితే ఇలా జరిగేదా?’’ అని మగపిల్లల్నే సపోర్ట్‌ చేసినట్లు మాట్లాడతారు. ‘‘నీ డ్రెస్‌ వల్లే ఇదంతా’’ అంటూ పై నుంచి కిందికి కోపంగా చూస్తారు!తల్లిదండ్రుల ఆవేదనను కొంతలో కొంత అర్థం చేసుకోవచ్చు.మరి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు ఏమైంది? సమాజాన్ని సంస్కారవంతంగా మలచవలసినవారు.. మామూలు తల్లిదండ్రుల్లా.. ఆడపిల్లల డ్రెస్‌ను జడ్జ్‌ చేయడం ఏమిటి? ఈవ్‌ టీజర్ల నోటికి కోరల్ని పొదగడం ఏమిటి?
గతనెల 9న - కాన్పూర్‌ (ఉత్తర ప్రదేశ్‌) యూనివర్శిటీ పరిధిలోని నాలుగు మహిళా కాలేజీలు.. దయానంద్‌ డిగ్రీ కాలేజ్‌, ఆచార్య నరేంద్ర దేవ్‌ కాలేజ్‌, సేన్‌ బాలికా కాలేజ్‌, జొహారీ డిగ్రీ కాలేజ్‌... జీన్స్‌ని నిషేధించాయి. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కాలేజీ గేటు బయట ఈవ్‌ టీజంగ్‌ జరుగుతోంది కనుక ఇకనుంచి అమ్మాయిలెవరూ జీన్స్‌ ప్యాంట్‌, టైట్‌ టాప్స్‌ వేసుకుని కాలేజీకి రాకూడదని నోటీసు బోర్డులలో పెట్టారు. రోజురోజుకీ ఎక్కువౌతున్న ఈవ్‌ టీజింగ్‌ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దయానంద్‌ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ మీతా జమాల్‌ మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు! ‘‘త్వరలో యూనిఫాం ప్రవేశపెట్టబోతున్నాం. ‘కాలేజ్‌కి ఇవాళ ఏ డ్రెస్‌ వేసుకెళ్ళాలనే దీర్ఘాలోచనతో అమ్మాయిలిక టైమ్‌ వేస్ట్‌ చేసుకోనవసరం లేదు’’ అని అన్నారావిడ. అదే కాలేజీలో మరో నిబంధన కూడా విధించారు. లేడీ టీచర్లు హై హీల్స్‌, స్లీవ్‌లెస్‌ బ్లవుజ్‌లు వేసుకుని రాకూడదు. అలా వస్తే వంద రూపాయల ఫైన్‌!
కాలేజీలలో విద్యార్థినులకు యూనిఫాం కొత్త విధానమేమీ కాదు. జపాన్‌, చైనా, ఉత్తర కొరియా, క్యూబ్లా, ఇంగ్లండ్‌లలో యువతులకు ప్రత్యేకంగా ‘అడల్ట్‌ స్కూల్‌ యూనిఫాం’లు ఉన్నాయి. ఐక్యత, సమభావం, క్రమబద్ధత, విద్యాస్ఫూర్తి... ఆ యూనిఫాంల లక్ష్యం. కానీ మనదేశంలో ఒక ప్రత్యేకమైన వస్త్రధారణను (ఉదా: జీన్స్‌, స్లిట్‌ స్కర్ట్‌‌స) నిషేధించడం కోసం యూనిఫాంను ప్రవేశపెట్టే అనారోగ్యకరమైన ధోరణి మొదలైంది. ఈవ్‌ టీజర్ల కాళ్లు చేతులు విరగ్గొట్టలేక, అమ్మాయి కాళ్లూ, చేతులు కప్పేసే మార్గాలను మన విశ్వవిద్యాలయాలు ఎంచుకోవడం వింతే! ఒంటికి అతుక్కుని ఉండే జీన్స్‌, అబ్బాయిలను రెచ్చగొడతాయని మీతా జమాల్‌ భావన. అదే నిజమనుకున్నా - తమకు ఇష్టం వచ్చినట్లు ఉండే స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదా? జీన్స్‌ వేసుకుంటే వచ్చి మీద పడిపోతారా? నడుము కిందికి దిగిన ప్యాంట్లతో అండర్‌వేర్‌ పట్టీలను ప్రదర్శిస్తూ తిరుగుతున్న అబ్బాయిలకు నాలుగు తగిలించకుండా, ఆడపిల్లలను కట్టడి చేయడం ఏమిటి? చిన్న విషయంలో సమధర్మం పాటించలేక పోతున్నాం. మళ్ళీ స్ర్తీ పురుష సమానత్వం అంటుంటాం! ఆడపిల్లల్ని ఏడిపించే స్వభావం ఉన్నవాడిని ఏ దుస్తులు మాత్రం అడ్డుకుంటాయి? ఇంత సూక్ష్మమైన విషయాన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు గ్రహించలేకపోతున్నాయా? కొన్ని కాలేజీలు జీన్స్‌ వద్దంటాయి. కొన్ని కాలేజీలు చుడీదార్‌లు వద్దంటాయి! అసలు ఈవ్‌ టీజింగ్‌కి, దుస్తులకు సంబంధం ఉందని ఎందుకనుకుంటున్నారు?
చెన్నై దగ్గరి పోరూర్‌లోని ‘వెంకటేశ్వర హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజీ’లో.. ఇంటెర్నీలు చీర మాత్రమే కట్టుకుని రావాలన్న నిబంధన ఉంది. డిసిప్లీన్‌ కోసం అట! ఇంటె ర్నీలు ఎవరైనా ఏడాది పాటు ఆ కాలేజీకి కచ్చితంగా చీరలోనే రావాలి. అయితే వి.కమలం అనే విద్యార్థినికి చీర అసౌకర్యంగా అనిపించి, చుడీదార్‌లో వచ్చేందుకు తనను అనుమతించమని యాజమాన్యాన్ని కోరారు. అందుకు యాజమాన్యం నిరాకరించింది. దాంతో ఆ యువతి జాతీయ మహిళా కమిషన్‌ను, మద్రాసు హైకోర్డును ఆశ్రయించారు. ఈ నెల 1న తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. కచ్చితంగా చీర కట్టుకుని రావాలన్న నిబంధన ప్రాస్పెక్టస్‌లో లేకపోవడం వల్ల డ్రెస్‌ కోడ్‌ విషయమై విద్యార్థిని మీద ఒత్తిడి తేవడం సమంజసం కాదని జస్టిస్‌ కె. వెంకట్రామన్‌ అభిప్రాయపడ్డారు. డీసెన్సీ కోసం చీరను తమ డ్రెస్‌ కోడ్‌గా పెట్టుకున్నట్లు కళాశాల యాజమాన్యం వాదించింది. ఈవ్‌టీజింగ్‌కి-డ్రెస్‌కు సంబంధం లేనట్లే, డ్రెస్‌కు-డీసెన్సీకి సంబంధం లేదని తాజా తీర్పుతో స్పష్టం అయింది. అమ్మాయిలను ఏడిపించడం, అనాగరికంగా ప్రవర్తించడం వ్యక్తి స్వభావానికి సంబంధించినవి తప్ప వస్ర్తధారణవి కావు.
నిర్దోషికి శిక్షఈవ్‌ టీజింగ్‌కి ఇప్పటి వరకు మనం కనుక్కున్న పరిష్కారాలన్నీ నేరస్థుడిని వదిలేసి, నిర్దోషికి శిక్షించినట్లు ఉన్నవే! మన ఆలోచనా ధోరణిలో బోలుతనాన్ని ఎండగడుతూ ‘ది రేషనల్‌ ఫూల్‌ బ్లాగ్‌ స్పాట్‌ డాట్‌ కామ్‌’లో ‘టాప్‌ టెన్‌ సొల్యూషన్స్‌ ఫర్‌ ది ఈవ్‌ టీజింగ్‌’ అంటూ పది పరిష్కారాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి: అబ్బాయిలందరినీ ఆస్ట్రేలియా పంపడం. (ఈ మధ్య అక్కడ మనవారిపై దాడులు జరుగుతున్నాయి కదా. అందుకు.) రెండు: న్యూఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లను, రామ్‌సేనను ఆహ్వానించడం. మూడు: దేశంలోని స్కూళ్ళలో, కాలేజీలన్నిటిలో మగపిల్లలకు 100 శాతం రిజర్వేషన్‌ కల్పించడం. మిగతావి ఇక్కడ ప్రస్తావించతగ్గ పరిష్కారాలు కావు.టీజింగ్‌ మూలాలను ఆడపిల్లల దుస్తుల్లో వెతుక్కుంటున్నందు వల్లనే మన ఆలోచనలు ఇంత నాసిరకంగా ఉంటున్నాయి ఆ ‘బ్లాగర్‌’ చక్కగా చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక కోర్టు... రాగింగ్‌ ‘తగిన’ శిక్ష విధించింది. నెలరోజుల పాటు గాంధీ హాస్పిటల్‌ వార్డుకు పారిశుధ్య సేవలను అందించవలసిందిగా నేరస్థుడిని ఆదేశించింది. అబ్బాయిలలో మానసిక పరివర్తన తెచ్చే ఇలాంటి చర్యలు ఈవ్‌టీజింగ్‌కు కూడా అవసరమే. దేశంలోని కొన్ని పాఠశాలలు ప్రైమరీ స్థాయి నుంచి బాలికలకు మార్షల్‌ ఆర్ట్‌‌సలో శిక్ష ఇస్తున్నట్లే... అబ్బాయిలకు అన్ని తరగతుల్లోనూ సత్ప్రవర్తనను, అమ్మాయిల పట్ల వ్యవహరించవలసిన తీరును ఒక సిలబస్‌గా చేరిస్తే బాగుంటుంది.