Wednesday, July 8, 2009

ఏడు మల్లెలెత్తు రాకుమారుడు!

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. ఒకే ఒక భారతీయుడికి మాత్రం స్వాతంత్య్రం 2009 జూలై 2న వచ్చింది. ఆ జంటిల్మన్‌... మన్వేంద్రసింగ్‌ గోహిల్‌! పూర్తి పేరు ‘యువరాజ్‌ శ్రీ మన్వేంద్ర సంఘ్‌జీ రఘువీర్‌ సింఘ్‌జీ సాహిబ్‌’.ఖడ్గంలాంటి పేరు! పువ్వులాంటి మనిషి!! ఇండియా అంటే మన్వేంద్రకు ‘గే’ ఇండియా మాత్రమే. ఆయన ఏనాడూ మన జెండాను ఎగరేయలేదు. ఎగురుతున్న జెండాకు సెల్యూట్‌ చేయలేదు. మన్వేంద్ర స్వీడన్‌ వెళ్ళినప్పుడు ఒక బ్రిటన్‌ సంతతి మర్యాదస్థుడు ఆయనను కలిశారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్‌ను (1860) ప్రవేశపెట్టిన బ్రిటిష్‌ వలస పాలకుల తరఫున ఆయన అత్యంత అపరాధ భావనతో చేతి వేళ్ళు విరుచుకుంటూ మన్వేంద్రను క్షమాపణలు కోరారు. ‘గార్డియన్‌’ పత్రిక ప్రతినిధి గారెత్‌ మెక్లీన్‌కి ఈ విషయం చెబుతూ - ‘‘బాధపడవద్దని ఆ జంటిల్మన్‌తో అన్నాను. పాపం ఆయన తప్పేముంది? 1860లో మేము స్వాతంత్య్రాన్ని కోల్పోయాం. అదింకా రాలేదు’’ అన్నారు మన్వేంద్ర ఆవేదనగా. ఎట్టకేలకు...ప్రిన్స్‌ మన్వేంద్ర యవ్వనంలోకి వచ్చిన ముప్పై ఏడేళ్ళ తర్వాత...ఢిల్లీ హైకోర్టు భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించింది! స్వలింగ సంపర్కం తప్పేమీ కాదని ‘గే’ల బుగ్గలు పుణికింది.తీర్పు వెలువడిన వెంటనే దేశమంతటా ‘గే’ లు వీధులలోకి వచ్చి, ఒకరి బాహువులలో ఒకరు మైమరచి ఆడారు, పాడారు. జల్లులై కురిసిన విరహపు ఆవిర్లలో తడిసి, నడి వేసవి చెంపలకు సుతారంగా గులాబీ రంగులు అద్దారు. బయట ఇంత జరుగుతుంటే -ప్రిన్స్‌ మన్వేంద్ర మాత్రం గుజరాత్‌లోని తన రాజ్‌పిప్లా రాజప్రాసాదంలో గురువర్యులు పురుషోత్తం వలవల్కర్‌ చెంతన లలిత సంగీత సాధనలో లీనమైయున్నారు! ఆత్మ శాంతిస్తే మనసు చిందులు వేయదు. ఉద్యమ సారథిని విజయం ఉద్వేగపరచలేదు.ఇప్పుడు కాదు, ‘‘ప్రజలారా వినండి. నేను గే ని’’ అని అంతఃపురం నుండి ధైర్యంగా ప్రకటించుకున్నప్పుడే మన్వేంద్ర విజేత అయ్యాడు. జగదేక ‘గే’ వీరుడయ్యాడు. గే జీవుల ఆత్మ, పరమాత్మ అయ్యాడు.
***
ప్రిన్స్‌ మన్వేంద్రసింగ్‌ గోహిల్‌ జీవితానికి, ప్రిన్స్‌ అకీమ్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇద్దరిదీ బద్దలైన హృదయమే. అయితే అకీమ్‌ది కల్పిత బాధ. 1988 నాటి ఎడ్డీ మర్ఫీ చిత్రం ‘కమింగ్‌ టు అమెరికా’లో ప్రిన్స్‌ అకీమ్‌ ఒక పాత్ర మాత్రమే. జమండా అనే ఒక సంపన్న దేశపు రాకుమారుడు అకీమ్‌. పెద్దలు కుదిర్చిన వధువును కాదని, తన కలలరాణిని వెతుక్కుంటూ స్నేహితుడితో కలిసి అమెరికా వెళతాడు. చివరికి న్యూయార్క్‌లో అతడి జన్మసార్థకమౌతోంది. లీసా అనే యువతి ప్రేమలో పడతాడు. లీసా తండ్రికి ఒక రెస్టారెంట్‌ ఉంటుంది. ఆఫ్రికన్‌ యూనివర్శిటీ విద్యార్థులమని చెప్పుకుని మిత్రులిద్దరూ అందులో తిష్టవేస్తారు. కాలక్రమంలో లీసా కూడా అకీమ్‌ను ప్రేమిస్తుంది. అకీమ్‌ రాజపుత్రుడని తెలిశాక అతడి ప్రేమను తిరస్కరిస్తుంది.మన్వేంద్రను అలా తిరస్కరించిన అమ్మాయి... అతడి భార్య చంద్రికా కుమారి!వివాహానికీ, విడాకులకు మధ్య ఏడాది వ్యవధిలో వందల కొద్దీ నిద్రలేని ఒంటరి రాత్రులను గడిపారు మన్వేంద్ర. ‘‘1991లో మా పెళ్ళి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఝుబువా నుంచి ఎన్నో ఆశలతో నా జీవన సహచరిగా మా అంతఃపురానికి వచ్చింది చంద్రిక. శయన మందిరంలో ఆమె గుర్తించి చెప్పేవరకు నాలోని అసహజత్వమేమిటో నేను తెలుసుకోలేకపోయాను. అప్పటి వరకూ మగాళ్ళంతా నాలాగే మగాళ్ళకు ఆకర్షితులౌతారని అనుకునేవాడిని’’ అని రెండేళ్ళ క్రితం ‘గే అరౌండ్‌ ది వరల్డ్‌’ అనే టాక్‌ షోలో ఓప్రా విన్‌ఫ్రే ముందు తొలిసారి మనసు విప్పారు మన్వేంద్ర. ‘కలయిక’లోని వైఫల్యం మన్వేంద్ర దాంపత్యాన్ని కల్లోల పరిచింది. తల్లిదండ్రులతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. కుమారుడి ‘అపరిపూర్ణత’ వల్ల వంశ ప్రతిష్ట భ్రష్టుపట్టి పోయిందని తండ్రి వ్యధ చెందాడు. ఒకే ఇంట్లో ఉంటున్నా కొడుకు ముఖం చూడకుండా రాజమాత తలతిప్పుకుని పోయేవారు. మన్వేంద్ర ఇవేవీ పట్టించుకోలేదు. లోకం దృష్టిలోని తన అసహజత్వానికి ఆయన గౌరవాన్ని ఆపాదించుకున్నారు. ‘గే’లకు గౌరవం తెచ్చిపెట్టారు. వారి కోసం, వారి పక్కన నిలబడ్డారు. గే లతోకలిసి, గే లను కలుపుకుని ఎయిడ్స్‌పై ఉద్యమించడానికి 2005లో రాజభవనం వదలి బయటికి వచ్చారు. ఇప్పుడాయన ‘గే’ల ఆత్మగౌరవ అధినాయకుడు. ‘గే’లు గౌరవించే ‘రజనీష్‌’. ‘గే’లకు సార్వజనీనమైన ప్రేమను పంచే ఓషో. ఎల్‌.జి.బి.టి. (లెస్బియన్‌, గే, బెసైక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) హక్కుల కోసం గత నాలుగేళ్ళుగా ఆయన అమెరికా, ఐరోపాదేశాలలో పర్యటిస్తున్నారు. పబ్బులలో గడుపుతున్నారు! ఈ ఏడాది బ్రెజిల్‌లో, నిరుడు స్వీడన్‌లో జరిగిన ‘యూరో ప్రైడ్‌’ గేల మహాసభలకు ముఖ్య అతిథి ఆయనే! 2010లో వార్సాలో జరిగే సదస్సుకు కూడా ముందస్తు ఆహ్వానం అందింది. బి.బి.సి-త్రీ ఆయనతో ‘అండర్‌కవర్‌ ప్రిన్సెస్‌’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఈ జనవరిలో నాలుగు ఎపిసోడ్‌లుగా ప్రసారం చేసింది. ‘కమింగ్‌ టు అమెరికా’ చిత్రాన్ని పోలివున్న ఆ రియాల్టీ షోలో మన్వేంద్రతో పాటు జాఫ్నా రాకుమారుడు రెమిజియస్‌ జెర్రీ కనగరాజ్‌, దక్షిణాఫ్రికా యువరాజు ‘జులు’ కూడా పాల్గొన్నారు. ఇంగ్లండ్‌ దక్షిణ తీర ప్రాంతమైన బ్రిగ్టన్‌లో వీరి మకాం. ముగ్గురూ కలిసి ఉండేవారు. పగలు మారువేషంలో వధువు వేటకు బయల్దేరేవారు. బార్‌మన్‌గా, వెయిటర్‌గా, హౌస్‌ కీపర్‌గా చేరి రహస్యంగా తమ డ్రీమ్‌గర్ల్‌ కోసం వెదకులాడేవారు. చివరికి ముగ్గురూ వధువు అన్వేషణలో విఫలమయ్యారు. ఒక్క అమ్మాయినైనా వలలో వేసుకోలేకపోయారు. ఇంతకీ అమ్మాయిలకు ఏం కావాలి? మగాళ్ళలో వారేం కోరుకుంటారు?అందం - డబ్బు - చదువు - సంస్కారం - వంశం.... ‘‘ఏదీ కాదు’’ అంటారు మన్వేంద్ర.‘‘మనసు చిత్రమైనది. ఎప్పుడు ఎవర్ని ఎందుకు కోరుకుంటుందో తెలీదు. ప్రేమ ఎవరి మధ్య ఏ కారణంతో అంకురించినా, అసలు కారణమే లేకుండా అంకురించినా... ఆ ప్రేమ భావాన్ని గౌరవించడం నాగరికుల బాధ్యత. స్ర్తీ పురుషులు మాత్రమే ప్రేమించుకోవాలని ఎవరైనా అంటే... అలా అన్నవారు మానవ పరిణామ దశలో ఎక్కడో ఆగిపోయారనే అనుకోవాలి..’’ అని రియాల్టీ షో ముగింపు కార్యక్రమంలో అన్నారు మన్వేంద్ర.
***
ఒక క్షత్రియ పుత్రుడు.. ‘అమ్మయ్యో’ అని చెంపకు చెయ్యి ఆన్చి, అంతఃపురంలో గాలికి ఊగుతున్న పొడవాటి పరదాల చాటునుంచి కళ్ళు టపటపలాడిస్తూ... రాజప్రాసాదానికి వచ్చివెళుతుండే మగధీరులను గుబగుబలాడే గుండెలతో వీక్షించడంలోని అసహజత్వాన్ని వంశగౌరవానికి సంబంధించిన విషయంగా భావించిన రాజకుటుంబం... విషయాన్ని గుట్టుగా ఉంచాలని ప్రయత్నించింది. కానీ, ఆ అసహజత్వాన్ని తన విలక్షణమైన స్వభావంగా భావించిన రాకుమారుడు మన్వేంద్ర తనే స్వయంగా మీడియా ద్వారా నిజాన్ని లోకానికి చాటారు. ప్రిన్స్‌ మన్వేంద్రలోని ఈ అవాంఛనీయమైన సున్నితత్వం... తొలిసారిగా నాలుగేళ్ళ క్రితం బహిర్గతమైనప్పుడు గుజరాత్‌ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. కూడళ్ళలో ఆయన ప్రతిమలు దగ్ధం అయ్యాయి. పూర్వ వైభవాన్ని కాపాడుకుంటూ వస్తున్న రాజ్‌పిప్లా రాజ్యప్రతిష్ట మంచం పట్టింది. ప్రిన్స్‌ మన్వేంద్రకు... తండ్రి మహారాణా శ్రీ రఘువీర్‌ సంఘ్‌జీ రాజేంద్రసింఘ్‌జీ సాహిబ్‌... నీళ్ళు, నువ్వులు వదల్లేకపోయారు. ఇంట్లోంచి వెళ్ళగొట్టి మళ్లీ తెచ్చుకున్నారు. అయితే ఆయనకు అల్ప సంతోషం కలిగించే విషయం ఒకటి ఉంది.మగవాళ్ళను మాత్రమే ఇష్టపడే ప్రిన్స్‌ మన్వేంద్ర... పూర్తిస్థాయిలో తన లైంగిక అస్తిత్వాన్ని కోల్పోలేదు. ఆయనలో ఇంకా ఏ మూలనో మగువల పట్ల ఆసక్తి దాగి ఉన్నట్లుంది. ‘‘నేనే గనుక పరిపూర్ణ పురుషుడిని అయివుంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానని అడిగి ఉండేవాడిని’’ అని టాక్‌ షోలో విన్‌ఫ్రేను ఉద్దేశించి ఆయన అన్నారు. ఆ మాటకు విన్‌ఫ్రే ఎంతో హూందాగా స్పందించారు. ‘‘రాణివాసం బాగుంటుంది కదా’’అని అన్నారు. మన్వేంద్రసింగ్‌ ఆవిడను అంతగా ఇష్టపడడానికి తగిన కారణమే ఉంది. ‘‘నేను విన్‌ఫ్రే ఇంటర్వ్యూలు చూస్తూ పెరిగాను. వాస్తవం ఏమిటో అవాస్తవం ఏమిటో ఆవిడ సరిగ్గా అంచనా వేస్తారు. నిజాన్ని నమ్ముతారు. నిజం చెప్పేవారికి అండగా ఉంటారు. ఆవిడకు దగ్గరగా కూర్చుని మాట్లాడ్డం బాగుంటుంది. తన సమక్షంలో ఆ రెండు గంటలూ నాకెంతో ఉల్లాసంగా గడిచాయి’’ అని మన్వేంద్ర ‘గార్డియన్‌’ ఇంటర్వ్యూలో గారెత్‌ మెక్లీన్‌తో చెప్పారు.టాక్‌ షో పూర్తయ్యాక విన్‌ఫ్రేకు గణనాథుని విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు మన్వేంద్ర. ఆ కానుకను ఎంతో అపురూపంగా స్వీకరించారట విన్‌ఫ్రే.
కోమలమైన మనసును క్రోమోజోములతో వర్గీకరించలేం.

Sunday, July 5, 2009

మగాళ్ళు మారడమే బెటర్

‘‘నువ్వు చూడకపోతే వాడెందుకు చూస్తాడు?!’’ అని అమ్మానాన్న కోపంగా అనేశాక -పదమూడేళ్ళ పిల్ల...కనీసం మరో ఐదేళ్ళపాటైనా అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో కంప్లైంట్‌ చేసే హక్కు కలిగివున్న పిల్ల...మళ్లీ జీవితంలో మనసు విప్పగలదా?
ఎట్లీస్ట్‌ -‘‘నేను చూడలేదు’’ అని నోరు తెరిచి చెప్పడానికైనా ఆ పిల్లకు ఆత్మవిశ్వాసం మిగిలి ఉంటుందా? ఆడపిల్లల ఆత్మ విశ్వాసాన్ని తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు కాలేజీలు కూడా దెబ్బతీస్తున్నాయి! ‘‘మీరెవర్నీ చూడనవసరం లేదు. టైట్‌ జీన్స్‌ వేసుకొస్తే చాలు, అబ్బాయిలు మీ వెంట పడటానికి’’ అంటున్నాయి యాజమాన్యాలు!! పోనీ ఎలాంటి డ్రెస్‌ వేసుకొస్తే టీజ్‌ చెయ్యరో చెప్పమనండి. చుడీదార్‌, సల్వార్‌ కమీజ్‌, ప్యాంటూ షర్ట్‌...ఒక్కో కాలేజీలో ఒక్కో నిబంధన. ఎక్కడైనా ఆగిందా అమ్మాయిల్ని ఏడిపించడం?!
***
నిజానికి ఆడపిల్లలు ధైర్యవంతులు. తమకు నచ్చినట్లు తాము ఉండగలరు. ఆ ధైర్యం మనకు లేదు! వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళను ఉండనివ్వం.
ఆడపిల్లలు వివేకవంతులు. ఎవరికి దూరంగా ఉండాలో వాళ్ళకు తెలుసు.ఆ వివేకం మనకు లేదు! అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు అని చెబుతుంటాం.
ఆడపిల్లలు ఎప్పటికీ తప్పు చేయరు. అమ్మానాన్న... వారి కళ్ళల్లో మెదులుతుంటారు.ఆ నమ్మకం మనకు లేదు! మూయని కనురెప్పలమై, వారికి నిద్రలేకుండా చేస్తుంటాం.
వార్డ్‌రోబ్‌ దగ్గర మనమ్మాయి కాసేపు నిలబడితే వెంటనే మనకు దడ పుట్టుకొచ్చేస్తుంది... ‘‘ఇప్పుడిది టైట్‌ జీన్స్‌లోకి మారిపోతుందా!’’అని బెంగ పెట్టేసుకుంటాం.
క్లాస్‌మేట్‌ పీటర్‌ జెడ్డా... బైక్‌ మీద ఇంటి వరకూ వచ్చి మన పిల్లను డ్రాప్‌ చేసి వెళ్తే... ఆ రాత్రి మనకు స్లీపింగ్‌ పిల్స్‌ అవసరమౌతాయి.
ఆఫీసులో ఉండగా తండ్రికో, కూరలు తరుక్కుంటుండగా తల్లికో... ఎవరో ఫోన్‌ చేసి చెబుతారు.. ‘‘మీ అమ్మాయి బస్టాప్‌లో ఎవరి చెంపో పగలకొట్టింద’’ని. ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి...కుటుంబ సభ్యురాలు కాకుండా పోతుంది!
***
ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇంత అధైర్యంగా, అపనమ్మకంగా ఉండడానికి కారణం.. తమ బంగారుతల్లులపై వారికున్న ప్రేమే. అందులో సందేహం లేదు. అయితే కట్టడి పేరుతో వారు విధించే ఆంక్షలు.. ప్రధానంగా డ్రెస్‌పై విధించే ఆంక్షలు చాలాసార్లు అర్థరహితంగా అనిపిస్తాయి.
ఏ ఇంట్లోనైనా... వయసొస్తున్న అమ్మాయి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే తొలి ఆంక్ష... డ్రెస్‌కి సంబంధించినదే అయివుంటుంది. ఒక్కోసారి పేరెంట్స్‌ ఎంత అసహాయంగా అయిపోతారంటే - అదిమిపెట్టుకున్న దుఃఖంతో ఇంటికి చేరిన అమ్మాయిని గుండెకు అదుముకుని ఓదార్చవలసింది పోయి, ‘‘లంగాఓణి వేసుకుని వెళితే ఇలా జరిగేదా?’’ అని మగపిల్లల్నే సపోర్ట్‌ చేసినట్లు మాట్లాడతారు. ‘‘నీ డ్రెస్‌ వల్లే ఇదంతా’’ అంటూ పై నుంచి కిందికి కోపంగా చూస్తారు!తల్లిదండ్రుల ఆవేదనను కొంతలో కొంత అర్థం చేసుకోవచ్చు.మరి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు ఏమైంది? సమాజాన్ని సంస్కారవంతంగా మలచవలసినవారు.. మామూలు తల్లిదండ్రుల్లా.. ఆడపిల్లల డ్రెస్‌ను జడ్జ్‌ చేయడం ఏమిటి? ఈవ్‌ టీజర్ల నోటికి కోరల్ని పొదగడం ఏమిటి?
గతనెల 9న - కాన్పూర్‌ (ఉత్తర ప్రదేశ్‌) యూనివర్శిటీ పరిధిలోని నాలుగు మహిళా కాలేజీలు.. దయానంద్‌ డిగ్రీ కాలేజ్‌, ఆచార్య నరేంద్ర దేవ్‌ కాలేజ్‌, సేన్‌ బాలికా కాలేజ్‌, జొహారీ డిగ్రీ కాలేజ్‌... జీన్స్‌ని నిషేధించాయి. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కాలేజీ గేటు బయట ఈవ్‌ టీజంగ్‌ జరుగుతోంది కనుక ఇకనుంచి అమ్మాయిలెవరూ జీన్స్‌ ప్యాంట్‌, టైట్‌ టాప్స్‌ వేసుకుని కాలేజీకి రాకూడదని నోటీసు బోర్డులలో పెట్టారు. రోజురోజుకీ ఎక్కువౌతున్న ఈవ్‌ టీజింగ్‌ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దయానంద్‌ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ మీతా జమాల్‌ మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు! ‘‘త్వరలో యూనిఫాం ప్రవేశపెట్టబోతున్నాం. ‘కాలేజ్‌కి ఇవాళ ఏ డ్రెస్‌ వేసుకెళ్ళాలనే దీర్ఘాలోచనతో అమ్మాయిలిక టైమ్‌ వేస్ట్‌ చేసుకోనవసరం లేదు’’ అని అన్నారావిడ. అదే కాలేజీలో మరో నిబంధన కూడా విధించారు. లేడీ టీచర్లు హై హీల్స్‌, స్లీవ్‌లెస్‌ బ్లవుజ్‌లు వేసుకుని రాకూడదు. అలా వస్తే వంద రూపాయల ఫైన్‌!
కాలేజీలలో విద్యార్థినులకు యూనిఫాం కొత్త విధానమేమీ కాదు. జపాన్‌, చైనా, ఉత్తర కొరియా, క్యూబ్లా, ఇంగ్లండ్‌లలో యువతులకు ప్రత్యేకంగా ‘అడల్ట్‌ స్కూల్‌ యూనిఫాం’లు ఉన్నాయి. ఐక్యత, సమభావం, క్రమబద్ధత, విద్యాస్ఫూర్తి... ఆ యూనిఫాంల లక్ష్యం. కానీ మనదేశంలో ఒక ప్రత్యేకమైన వస్త్రధారణను (ఉదా: జీన్స్‌, స్లిట్‌ స్కర్ట్‌‌స) నిషేధించడం కోసం యూనిఫాంను ప్రవేశపెట్టే అనారోగ్యకరమైన ధోరణి మొదలైంది. ఈవ్‌ టీజర్ల కాళ్లు చేతులు విరగ్గొట్టలేక, అమ్మాయి కాళ్లూ, చేతులు కప్పేసే మార్గాలను మన విశ్వవిద్యాలయాలు ఎంచుకోవడం వింతే! ఒంటికి అతుక్కుని ఉండే జీన్స్‌, అబ్బాయిలను రెచ్చగొడతాయని మీతా జమాల్‌ భావన. అదే నిజమనుకున్నా - తమకు ఇష్టం వచ్చినట్లు ఉండే స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదా? జీన్స్‌ వేసుకుంటే వచ్చి మీద పడిపోతారా? నడుము కిందికి దిగిన ప్యాంట్లతో అండర్‌వేర్‌ పట్టీలను ప్రదర్శిస్తూ తిరుగుతున్న అబ్బాయిలకు నాలుగు తగిలించకుండా, ఆడపిల్లలను కట్టడి చేయడం ఏమిటి? చిన్న విషయంలో సమధర్మం పాటించలేక పోతున్నాం. మళ్ళీ స్ర్తీ పురుష సమానత్వం అంటుంటాం! ఆడపిల్లల్ని ఏడిపించే స్వభావం ఉన్నవాడిని ఏ దుస్తులు మాత్రం అడ్డుకుంటాయి? ఇంత సూక్ష్మమైన విషయాన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు గ్రహించలేకపోతున్నాయా? కొన్ని కాలేజీలు జీన్స్‌ వద్దంటాయి. కొన్ని కాలేజీలు చుడీదార్‌లు వద్దంటాయి! అసలు ఈవ్‌ టీజింగ్‌కి, దుస్తులకు సంబంధం ఉందని ఎందుకనుకుంటున్నారు?
చెన్నై దగ్గరి పోరూర్‌లోని ‘వెంకటేశ్వర హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజీ’లో.. ఇంటెర్నీలు చీర మాత్రమే కట్టుకుని రావాలన్న నిబంధన ఉంది. డిసిప్లీన్‌ కోసం అట! ఇంటె ర్నీలు ఎవరైనా ఏడాది పాటు ఆ కాలేజీకి కచ్చితంగా చీరలోనే రావాలి. అయితే వి.కమలం అనే విద్యార్థినికి చీర అసౌకర్యంగా అనిపించి, చుడీదార్‌లో వచ్చేందుకు తనను అనుమతించమని యాజమాన్యాన్ని కోరారు. అందుకు యాజమాన్యం నిరాకరించింది. దాంతో ఆ యువతి జాతీయ మహిళా కమిషన్‌ను, మద్రాసు హైకోర్డును ఆశ్రయించారు. ఈ నెల 1న తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. కచ్చితంగా చీర కట్టుకుని రావాలన్న నిబంధన ప్రాస్పెక్టస్‌లో లేకపోవడం వల్ల డ్రెస్‌ కోడ్‌ విషయమై విద్యార్థిని మీద ఒత్తిడి తేవడం సమంజసం కాదని జస్టిస్‌ కె. వెంకట్రామన్‌ అభిప్రాయపడ్డారు. డీసెన్సీ కోసం చీరను తమ డ్రెస్‌ కోడ్‌గా పెట్టుకున్నట్లు కళాశాల యాజమాన్యం వాదించింది. ఈవ్‌టీజింగ్‌కి-డ్రెస్‌కు సంబంధం లేనట్లే, డ్రెస్‌కు-డీసెన్సీకి సంబంధం లేదని తాజా తీర్పుతో స్పష్టం అయింది. అమ్మాయిలను ఏడిపించడం, అనాగరికంగా ప్రవర్తించడం వ్యక్తి స్వభావానికి సంబంధించినవి తప్ప వస్ర్తధారణవి కావు.
నిర్దోషికి శిక్షఈవ్‌ టీజింగ్‌కి ఇప్పటి వరకు మనం కనుక్కున్న పరిష్కారాలన్నీ నేరస్థుడిని వదిలేసి, నిర్దోషికి శిక్షించినట్లు ఉన్నవే! మన ఆలోచనా ధోరణిలో బోలుతనాన్ని ఎండగడుతూ ‘ది రేషనల్‌ ఫూల్‌ బ్లాగ్‌ స్పాట్‌ డాట్‌ కామ్‌’లో ‘టాప్‌ టెన్‌ సొల్యూషన్స్‌ ఫర్‌ ది ఈవ్‌ టీజింగ్‌’ అంటూ పది పరిష్కారాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి: అబ్బాయిలందరినీ ఆస్ట్రేలియా పంపడం. (ఈ మధ్య అక్కడ మనవారిపై దాడులు జరుగుతున్నాయి కదా. అందుకు.) రెండు: న్యూఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లను, రామ్‌సేనను ఆహ్వానించడం. మూడు: దేశంలోని స్కూళ్ళలో, కాలేజీలన్నిటిలో మగపిల్లలకు 100 శాతం రిజర్వేషన్‌ కల్పించడం. మిగతావి ఇక్కడ ప్రస్తావించతగ్గ పరిష్కారాలు కావు.టీజింగ్‌ మూలాలను ఆడపిల్లల దుస్తుల్లో వెతుక్కుంటున్నందు వల్లనే మన ఆలోచనలు ఇంత నాసిరకంగా ఉంటున్నాయి ఆ ‘బ్లాగర్‌’ చక్కగా చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక కోర్టు... రాగింగ్‌ ‘తగిన’ శిక్ష విధించింది. నెలరోజుల పాటు గాంధీ హాస్పిటల్‌ వార్డుకు పారిశుధ్య సేవలను అందించవలసిందిగా నేరస్థుడిని ఆదేశించింది. అబ్బాయిలలో మానసిక పరివర్తన తెచ్చే ఇలాంటి చర్యలు ఈవ్‌టీజింగ్‌కు కూడా అవసరమే. దేశంలోని కొన్ని పాఠశాలలు ప్రైమరీ స్థాయి నుంచి బాలికలకు మార్షల్‌ ఆర్ట్‌‌సలో శిక్ష ఇస్తున్నట్లే... అబ్బాయిలకు అన్ని తరగతుల్లోనూ సత్ప్రవర్తనను, అమ్మాయిల పట్ల వ్యవహరించవలసిన తీరును ఒక సిలబస్‌గా చేరిస్తే బాగుంటుంది.

Friday, July 3, 2009

వినకుంటే, చూడకుంటే.. ఊరుకుంటుందా?

బీరువా అరల్లో సొంపుగా సర్దివుంచిన ఓ పాతిక ప్రథమశ్రేణి చీరల్లోంచి, ఆ రోజు కట్టుకోవలసిన రంగులను ఎంపిక చేసుకోడానికి మీకు నిమిషం కన్నా ఎక్కువ సేపు పట్టకపోతే బయట మీ గురించి ఆలోచించేవారు ఎవరూ లేరనే! ఎట్లీస్ట్‌... మిమ్మల్ని మీరు పట్టించుకోవడం లేదనే. దీనినొక అసహజమైన మానసిక స్థితిగా గుర్తించడానికి మీరు సుముఖంగా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి - ఒంటరిగానే అయినా - ఒక బాలీవుడ్‌ సినిమా చూసి రండి. అయితే అది ‘జిస్మ్‌’ శకారంభ అనంతర చిత్రం అయి ఉంటే మంచిది. అందులో మింకీ నునుపైన నాభి నుంచి ఐస్‌ ముక్కలు చల్లగా దిగువకు జారడం వంటి సన్నివేశాలను చూడలేకపోతే మీ ఇష్టం. ఆ కాసేపూ కళ్ళు మూసుకోవచ్చు. ‘ఖ్వాహిష్‌’లో మల్లికా శరావత్‌ తొలిరాత్రి శోభనం గదిలో భర్త హిమాంశు మాలిక్‌తో బిడియం వీడి, నిస్సిగ్గుగా చెప్పిన రెండు డైలాగులను మీ సంప్రదాయ దేహం తిరస్కరించవచ్చు. పోనీ వినకండి. ఎమ్రాన్‌ హష్మీ ముద్దులకు మెలికలు తిరిగిపోయే కథానాయిక కూడా మీకు ఎక్కడైనా తగలొచ్చు. ఆవిడ పాపానికి ఆవిడను వదిలేయండి. ‘ఛమేలీ’లో కరీనాకపూర్‌ జీవన విధానాన్ని పరికించడమా లేక ఆవిడ మేనిఛాయకు ఈడూజోడుగా ప్రతిఫలిస్తున్న అలంకరణల వర్ణ మిశ్రమాలను గుర్తు పెట్టుకుని అనుకరించడమా అన్నది పూర్తిగా మీ స్వభావాన్ని బట్టే ఉంటుంది కదా. అయినా సరే మీరు మారిపోతారు! థియేటర్‌ నుంచి బయటికి రాగానే మీ ప్రపంచం మారిపోతుంది. ఎందుకంటే - బాలీవుడ్‌ మారిపోయింది. భారతీయాత్మను నుదుటి బొట్టులా శోభిస్తున్న హిందీ చలన చిత్రాలు... మూడు పదులు దాటిన ఎన్నారై ఆడపడుచులను సైతం నిలువుటద్దాల ముందు నుంచి కదలనివ్వడం లేదు. కత్రీనా కైఫ్‌, హెక్‌ చహల్‌, జియాఖాన్‌ వంటి వారైతే టీనేజ్‌లోనే బాలీవుడ్‌ చేరిక కోసం చీరంచులు, కుచ్చిళ్ళు సవరించుకున్నారు. మార్చి మార్చి కట్టుకున్నారు. అభినయ ప్రతిభను రహస్యపు ఏకాంతంలో ప్రదర్శించి చూసుకున్నారు. భారత్‌లో హిందీ సినిమా... కార్పొరేట్‌ సంస్థల బ్రాండ్‌ అయింది. విదేశాలకు సాంస్కృతిక రాయబారిగా వెళుతోంది!! ఒక్కటైనా సినిమా తియ్యడం ఇప్పుడు టాటా ఇన్ఫోమీడియా, కె సెరా సెరా, పాంటలూన్‌, ఇ-సిటీ, మెటాలైట్‌ల ప్రతిష్ట! మల్టీప్లెక్స్‌ల మొగల్‌... మన్మోహన్‌ శెట్టి, మాఫియా థీమ్‌ల ముభావి రామ్‌గోపాల్‌ వర్మ... ఇంకా తనూజా చంద్ర, సుజయ్‌ ఘోష్‌, అపర్ణాసేన్‌, సుధీర్‌ మిశ్రా, ప్రీతిష్‌ నంది... వీరిలో ఎవరు ఎప్పుడు మనల్ని మింగేస్తారో తెలీదు. మొత్తానికైతే మనసు, దేహం సరెండరైపోతాయి.

సమయం: 2006 జూలై 9 ('వార్త ' సండే )

సందర్భం: ఎల్లలు దాటిన బాలీవుడ్‌ సమ్మోహన పరిశ్రమకు లొంగిపోయిన ఓ చిత్ర ప్రేమికుడు... జోనాథన్‌ తర్గోవ్నిక్‌. జొనాథన్‌... న్యూయార్క్‌ ఫొటోగ్రాఫర్‌. బాలీవుడ్‌ క్లాపర్‌ బోర్డు వెనుక కథల్ని, కల్చర్‌నీ మెల్‌బోర్న్‌లోని ‘ఇమిగ్రేషన్‌ మ్యూజియం’లో ప్రదర్శిస్తుంటారు ఆయన. ఇండియన్‌ సినిమా సమ్మోహనశక్తి నుంచి ఏ దేశమూ, ఏ మనిషీ తప్పించుకోలేరని ఆయన అంటారు. ఇతర భాషా చిత్రాలతో కలిపి భారత్‌లో ఏటా 900 సినిమాలు తయారవుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వీటిని వంద కోట్ల మంది ప్రేక్షిస్తున్నారు. వీరిలో 50 కోట్ల వరకూ 25 ఏళ్ళ లోపు భారతీయులే. గత కొన్నేళ్ళుగా హిందీ చలన చిత్రాలు కొత్త జీవన శైలులను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. వాటికి విదేశీయులూ ప్రభావితం అవుతున్నారు.ఈ నేపథ్యంలో - జొనాథన్‌ ఎగ్జిబిషన్‌కు మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు చూశాక.

జ్ఞాపకం: ఆఫీసులో స్ర్తీమూర్తులు నా నుండి దూరంగా జరగడం మొదలైంది ఈ ఐటమ్‌తోనే.

Wednesday, July 1, 2009

టూర్‌

ఆఖరి మగ చేపను కూడా తోడేసి, మగువల్ని నీళ్ళపై విహారానికి పంపి చూడండి... మళ్ళీ ఒడ్డుకు చేరేందుకు ఇష్టపడతారేమో. ఊహు. అట్నుంచటే. మానస సరోవరంలోకి, హిమాలయ మేఘాల్లోకి, అక్కడి నుంచి దిక్కుల్లోకి, ఆ పైన చుక్కల్లోకి.
రమ్మన్నా తిరిగి వస్తారనా? జాబిల్లి కోసం చంటి పిల్లల్లా మగాళ్ళెంత ఏడ్చి మొత్తుకున్నా! డాడీల చంకనెక్కి అద్దంలో చూసుకోవాలిక సొంత అమ్మనైనా. అమ్మ కూడానా?! వెళ్ళదా మరి! రోజువారీ రోటి పచ్చళ్ళ తయారీ మనోవికాస కేంద్రంలో చిటికెడు ఇంగువ, పది కాయల ఎండుమిర్చి, అర చెంచా ఆవాలు, సరిపడినంత ఉప్పు, చిన్న గరిటెడు నూనెతో ఎన్ని జన్మలపాటు దొండకాయ పికిల్‌ చేసి వడ్డించగలరు ఆవిడైనా, విసుగు విరామం లేకుండా.నాలుగ్గోడల నడుమ ఇరవై నాలుగ్గంటల ప్రదక్షిణ! భర్త చుట్టూ, పిల్ల గ్రహాల చుట్టూ.
ఆఫీసుల్లో మాత్రం ఎంత మంది గుట్టుగా సంసారం చేయట్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని! కదిలే ప్రీడమ్‌ లేని చోట ఉద్యోగమూ సంసారమే. ఆఫీస్‌కి వెళ్ళే దారిలో, వచ్చే దారిలో కూడా.మౌనంగా నలిగి నలిగి... నలిగి నలిగి... జీవితకాలం ఒక్కరోజే చీరలా - శరీరానికీ! ఇంటికి వచ్చీరాగానే నేరుగా బాత్రూమ్‌కి వెళ్ళి, బట్టలన్నీ లాగి పడేసి... పుట్టుమచ్చంత ఖాళీస్థలమైనా వదలకుండా ఒంటికి అంటిన కళ్ళనీ, ఒంటిని తాకిన వేళ్ళనీ, అన్నెససరీ ‘సారీ’లనీ, అర్థం లేని ‘థాంక్స్‌’లనీ, ‘లేడీస్‌ ఫస్ట్‌’ బొనాంజా ఆఫర్లనీ... చేప పొలుసుల్లా రుద్ది రుద్ది తోమేసి... మూలల్లో దాక్కుండిపోయిన మర్యాదస్థులని అంతే మర్యాదగా బైటికి రప్పించి, ఎన్ని పరిమళ భరితమైన విశిష్ట ఉత్పాదనలతో దేహాన్ని ఉతుక్కుంటే ఆ రాత్రికి నిద్రపడుతుందీ? అప్పటికీ కొలీగ్‌ ఎవరో మిగిలే ఉంటారు చెవిలో! డ్రెస్సింగ్‌ మిరర్‌ల్రో టవల్‌తో కమ్మలు అద్దుకుంటుండగా వచ్చి ‘ప్యూర్‌ బ్లాక్‌ మీదికి మెరూర్‌ కాంబనేషన్‌ మీకు బాగుంటుంది’’ అనేస్తారు. మనసులో అనుకోవచ్చు కదా సార్‌. మావారి స్కూటర్‌ వెనుక, సైడుకి కూర్చుని రయ్యిన వెళ్తున్నపుడు... నడుము పై భాగాన లేచి నిలబడే పైటంచు గొడుగులోంచి జాకెట్‌ హుక్స్‌ తీస్తుండే చూపులకీ, మీ ప్రశంసకీ తేడా ఉందా చెప్పండి. ఎందుకండీ మమ్మల్నిలా చంపుతారు... హాయిగా ఎటూ కదలనివ్వక.
***
నిజంగా చంపేస్తున్నామా? అయుండొచ్చు. ‘లుడాక్రిస్‌’లా డైనింగ్‌ టైబుల్‌పై ఒక చేత్తో నాజూకైన యంగ్‌ లేడీ లెగ్‌ని నోట్లో పెట్టుకుని, ఇంకో చేత్తో ఆ లేత కాలిపై సాల్ట్‌ పెప్పర్‌ చల్లుకుంటూ తినేయాలన్నంత క్రియేటివిటీ ఉంది మన దగ్గర.నీళ్ళనీ, పడవల్నీ, నేలనీ, ఆకాశాన్ని, గాలిని, పక్షుల్ని, అసలు పూర్తిగా వాళ్ళకు వాళ్ళని... ఎన్ని యుగాలపాటు వదిలేస్తే ధైర్యంగా వచ్చి మన సామీప్యాన్ని విశ్వసిస్తారో ఈ స్ర్తీలు!

సమయం: 2007 ఏప్రిల్‌ 22

సందర్భం: స్విట్జర్లాండ్‌ జూరిచ్‌ సరస్సులో పడవలపై యువతుల విహారాన్ని టీవీలో చూశాక.

జ్ఞాపకం: ‘‘ఎటునుంచి ఎటు వెళ్ళి ఎటొస్తారో అర్థంకాదు. మీలో మీరు ఎక్కడో మిస్సవుతుంటారు. మిమ్మల్ని మీరు వెతుక్కొలేక మాలాంటి వాళ్ళను ఏ గోతిలోనో తోసేసి వెళ్తారు. అవునా?’’ అని అప్పట్లో నాకు వచ్చిన ఉత్తరంలోని ఒక ప్రశ్న. అవునేమో.